Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

406 కేంద్రాలు.. 3,170 మంది సిబ్బంది


ఏలూరు: పోలింగ్‌ బూత్‌ల వద్ద పరిస్థితిపై అధికారులతో మాట్లాడుతున్న

ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రీకేశ్‌ లత్కర్‌

ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం: జిల్లాలో మంగళవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ ఆరంభంతో పుర ఎన్నికల వేడి మొదలైంది. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మళ్లీ ప్రారంభించారు. భద్రపరిచిన నామపత్రాలను బందోబస్తు నడుమ బయటికి తీశారు. మార్చి 10న జరగనున్న ఎన్నికలు, 14వ తేదీ నాటి లెక్కింపు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.  
కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం పురపాలికలు, ఏలూరు కార్పొరేషన్‌లోని 161వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం 185 ప్రాంతాల్లో 406 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 19 అతి సమస్యాత్మక, 40 సమస్యాత్మాక కేంద్రాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నికల కోసం 812 ఇంకు డబ్బాలు ఏర్పాటు చేయగా ఎన్నికల వాయిదాతో వీటికి కాలం చెల్లింది. ప్రస్తుతం కొత్తవి తీసుకొచ్చారు.
వారి స్థానంలో కొత్తవారిని
ఎన్నికలకు మొత్తం 3170 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 489 పీవోలు, 489 ఏపీవోలు, 59మంది ఎన్నికల పరిశీలకులు ఉన్నారు. ఇతర ఎన్నికల ఏర్పాట్లకు, సౌకర్యాల కల్పనకు 2133 మందిని నియమించారు. వీరిలో 30 మంది అధికారులు, సిబ్బంది పదవీవిరమణ, బదిలీ వంటి సమస్యలతో బయటకు వెళ్లిపోయారు. వారిస్థానంలో కొత్తవారిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారు. వీరిలో రెవెన్యూ, ఉపాధ్యాయులు, ఇతర అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. 

రేపటికి సిద్ధం
బుధవారంతో నామపత్రాల ఉపసంహరణ ముగియనుంది. అనంతరం బరిలో ఎంత మంది ఉన్నారో స్పష్టత వస్తోంది. పురపాలికల్లో మొత్తం 4,10,710 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్యకు పదిశాతం అదనంగా బ్యాలెట్‌ పత్రాలు ముద్రిస్తారు. ప్రస్తుతం ఈ పక్రియ కమిషనర్ల పర్యవేక్షణలో సాగుతోంది. ముద్రణను 4వ తేదీ సాయంత్రానికి పూర్తి చేస్తారు. అనంతరం స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరుస్తారు. 

లెక్కింపు  కేంద్రాలివే

14వ తేదీ లెక్కింపు జరుగుతుంది. ఒక్కో పురపాలికకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరులో సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల, నరసాపురంలో వైఎన్‌ కళాశాల, కొవ్వూరులో దీప్తీ పాఠశాల, జంగారెడ్డిగూడెంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, నిడదవోలులో మహిళా డిగ్రీకళాశాలల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.లెక్కింపు సమయంలో వెబ్‌కాస్టింగ్‌ జరుగుతుంది. సాధారణ, సూక్ష్మపరిశీలకులతో పాటు ఆయా పరిధిలోని ఆర్డీవో, సబ్‌కలెక్టర్లు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. జిల్లాలో పురపాలక ఎన్నికల పరిశీలకుడిగా బాలజీ వ్యవహరించనున్నారు. 

చీటీల పంపిణీ
ఓటరు చీటీలను అధికారులే పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పట్టణాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. ఈ నెల ఐదు నాటికి వీటి పంపిణీ పూర్తి చేయనున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని