Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిరీక్షించినా నిరాశే

● వేధిస్తున్న టీకాల కొరత

● రోజులు గడుస్తున్నా రాని వైనం


ఆకివీడు సీహెచ్‌సీలో ఎదురుచూస్తూ..

ఆకివీడు మండల పరిధిలో పెదకాపవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రం, కుప్పనపూడి, అయి భీమవరం సచివాలయాల్లో బుధవారం మధ్యాహ్నం టీకాలు అయిపోయాయి. మూడు రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ రాలేదు. మండల పరిధిలో ప్రజలు మాత్రం టీకాలు వస్తాయనే ఆశతో రోజూ వైద్యశాలలు, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రి, రెండో సచివాలయంలో టీకాల కొరత వేధిస్తోంది. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన 380 టీకాలు గురువారం మధ్యాహ్నానికే అయిపోయాయి. వచ్చిన వారిలో చాలా మంది వెనుదిరిగారు. శుక్రవారం మళ్లీ వచ్చినా నిల్వలు లేక ఇంటిదారి పట్టారు. సోమవారం టీకాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, ఏలూరు : ప్రజల్లో చైతన్యం పెరిగి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ముందుకు వస్తున్నా... ఆ మేరకు నిల్వలు ఉండటం లేదు. నిన్నమొన్నటి వరకు మందకొడిగా సాగిన ఈ ప్రక్రియ ఊపందుకొనే సమయానికి టీకాల కొరత ప్రతిబంధకంగా మారింది. రోజంతా నిరీక్షించినా వ్యాక్సిన్‌ అందుబాటులో లేక చాలా మంది వెనుదిరుగుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా అచంట, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, దెందులూరు వీరవాసరం, భీమవరం తదితర మండలాల్లో గురువారం మధ్యాహ్నానికే టీకాలు నిండుకున్నాయి. దీంతో ఆస్పత్రులకు, సచివాలయాలకు వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరిగి వెళ్లారు. వీరవాసరం, ఉండి, ఆచంట తదితర మండలాల్లో మధ్యాహ్నం వరకు నిరీక్షించినా ఫలితం లేదు. మంగళ, బుధ, గురువారాల్లో ఈ కార్యక్రమం కొంత వరకు సాగినా శుక్రవారం దాదాపు అన్ని మండలాల్లో కొరత కనిపించింది. వైద్య సిబ్బంది ముందుగా సమాచారం ఇస్తుండటంతో ఆ సమయానికి భారీగా జనం తరలివస్తున్నారు. ఇలాంటి వారంతా టీకా వేస్తారా లేదా అనే విషయంపై స్పష్టత లేక గంటల తరబడి అక్కడే వేచి చూస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో రోజుకు 12-15 వేల వరకు టీకాలు అవసరం కాగా నిత్యం ఈ స్థాయిలో డోసులు రావడం లేదు. వారంలో ఒకటి, రెండు సార్లు 20 వేలు వస్తున్నాయి. దీంతో రోజూ ఈ కార్యక్రమం సవ్యంగా సాగటం లేదు. ఒక వేళ వచ్చినా ఒకటి రెండు రోజుల్లోనే అయిపోతున్నాయి. మళ్లీ వచ్చే వరకు ప్రజలకు ఎదురు చూపులే మిగులుతున్నాయి. వైద్యసిబ్బంది మాత్రం టీకాలు ఉన్నాయా? లేవా అనే సమాచారం కూడా ఇవ్వటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ఇప్పటికీ మొదటి డోసు వేయించుకున్న నేపథ్యంలో వారికి అదే రకం రెండో డోసుగా అందించాలి. కానీ కొన్ని చోట్ల ఆ రకం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు.

వీరవాసరం, కొణితివాడ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం టీకాలు వేస్తున్నట్లు వాలంటీర్లు బుధవారం రాత్రి ఇంటింటికీ తిరిగి చెప్పారు. దీంతో 45 ఏళ్లు దాటిన చాలా మంది ఉదయం ఆస్పత్రులకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి చూసినా ఫలితం లేదు. సిబ్బందిని అడిగితే టీకాలు లేవని చెప్పారు. బుధవారం నుంచే అరకొరగా ఉన్నాయి. శుక్రవారం కూడా అందుబాటులోకి రాలేదు.

నేడు వస్తాయి: రాష్ట్రవ్యాప్తంగా టీకాల కొరత ఉంది. జిల్లాలో రోజుకు 15 వేల వరకు డోసులు అవసరమని గుర్తించి ప్రతిపాదనలు పంపించాం. శనివారానికి అందుబాటులోకి వస్తాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వాలంటీర్ల ద్వారా సమాచారం అందిస్తాం. -హిమాన్షు శుక్లా, జేసీ(అభివృద్ధి)

సుమారు 3 లక్షల మంది ఇందులో సిబ్బంది

11 లక్షల మంది వీరిలో వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు

ఇప్పటి వరకూ టీకా వేయించుకున్నవారు  70వేల మంది

జిల్లాలో 45 ఏళ్లు దాటినవారి సంఖ్య 2.3 లక్షల మంది

 12-15 వేలు జిల్లాకు రోజుకు అవసరం అయ్యే టీకాలు

పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బారులు తీరి..

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని