Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కన్నీటి చారిక.. విషాద గీతిక

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం


గణపతి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు

 

గోపాలపురం, న్యూస్‌టుడే: పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న వారిని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాతతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన దుర్ఘటన గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..గొడిగొయ్యల ధన గణపతి(18) మెకానిక్‌ పని, యర్రంశెట్టి కిషోర్‌(16) వెల్డింగ్‌ పని నేర్చుకోవడానికి కొన్ని రోజులుగా గోపాలపురం వస్తున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం తమ పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్న సమయంలో ఈదురుగాలులకు అదుపుతప్పి పడిపోవడంతో గణపతి అక్కడికక్కడే మృతి చెందగా కిశోర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కొనఊపిరితో ఉన్న కిశోర్‌ను 108లో గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఎస్సై సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మరణంలోనూ వీడని స్నేహం..

ఆ రెండు కుటుంబాల్లోనూ కుమారులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు స్నేహితులు. మరణంలోనూ స్నేహాన్ని వీడలేదంటూ కుటుంబ సభ్యుల రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇద్దరు కుటుంబ సభ్యులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. గణపతికి చెల్లి ఉంది. ఉన్నగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో కిశోర్‌ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కుమారులు తనకు నచ్చిన పని నేర్చుకుంటామంటే అడ్డు చెప్పలేదని ఇంతలోనే స్నేహితులిద్దర్నీ మృత్యువు కబలించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని