Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌పై పోరుకు సన్నద్ధం

● అదనంగా వైద్య సిబ్బంది నియామకానికి ఏర్పాట్లు ●

అందుబాటులోకి పరికరాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు


కాల్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న ప్రత్యేకాధికారిణి జయలక్ష్మి

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌పై పోరుకు యంత్రాంగం సర్వసన్నద్ధ.మైంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది రోగులకు చికిత్సనందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కేటాయించిన కొవిడ్‌ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులు, ఇతర సౌకర్యాలను సమకూర్చారు. ప్రభుత్వం జిల్లా కొవిడ్‌ ప్రత్యేక అధికారిగా నియమించిన జయలక్ష్మి శుక్రవారం ఏలూరు వచ్చారు. కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.

ప్రక్రియ ప్రారంభం కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలందించేందుకు జిల్లాకు 120 మంది వైద్యులను, 900 మంది సిబ్బంది నియామక ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే కొవిడ్‌ కోసం 34 మంది వైద్యులు పని చేస్తున్నారు. సిబ్బంది 500 మంది ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న 70 శాతం మంది వైద్యులకు నాన్‌ కొవిడ్‌ రోగులకు సేవలందించేలా వెసులుబాటు కల్పించారు.

పూర్తి స్థాయిలో ఆక్సిజన్‌ సౌకర్యం.. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 6 కె.ఎల్‌., ఆశ్రం ఆసుపత్రిలో 20 కె.ఎల్‌.లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌లను గత కొవిడ్‌ సీజన్‌లోనే ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆశ్రం ఆసుపత్రిలో కొవిడ్‌ కోసం ప్రత్యేకంగా 700 పడకలను సిద్ధంగా ఉంచారు. ఇవికాక ఏలూరు ప్రభుత్వాసుపత్రికి 47 ఆక్సిజన్‌ సిలిండర్‌లు, ఆశ్రం ఆసుపత్రికి 50, మిగిలిన ఆసుపత్రులకు ఒకొక్కదానికి 10 సిలిండర్ల చొప్పున కేటాయించారు.

24 గంటలూ సేవలు..‘కొవిడ్‌ రోగులకు 24 గంటలూ సేవలందించేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. రాత్రి సమయాల్లో అత్యవసరంగా చేర్చుకునేందుకు కొవిడ్‌ ఓపీ విభాగాలు ప్రత్యేకంగా పని చేస్తుంటాయి. అక్కడ నిరంతరం వైద్యులు, సిబ్బంది ఉంటారు. రాత్రి సమయాల్లో కూడా ఓపీ వద్ద కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తారు’. - డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌, డీసీహెచ్‌ఎస్‌.

వెంటిలేటర్లు సిద్ధం

జిల్లాకు కేటాయించినవి 260

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 98

ఆశ్రం ఆసుపత్రిలో 50

అత్యవసర సేవలు యథాతథం.. ఏలూరు ప్రభుత్వాసుపత్రితో పాటు జిల్లాలోని మిగిలిన ప్రభుత్వాసుపత్రిలన్నింటిలోనూ సాధారణ రోగులకు వైద్య సేవలందుతాయి. అత్యవసర సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. సాధారణ శస్త్రచిక్సితలను మాత్రం నిలుపుదల చేశారు. అత్యవసర శస్త్రచికిత్సలు యధావిధిగా కొనసాగించనున్నారు.

అధికంగా సొమ్ము వసూలు చేస్తే చర్యలు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు అధికంగా సొమ్ము వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని కొవిడ్‌-19 ప్రత్యేకాధికారిణి జి.జయలక్ష్మి ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై శుక్రవారం ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తే చర్యలు తీసుకునేందుకు ఆర్డీవో, డిప్యూటీ డీఎం, హెచ్‌వో, డీఎస్పీలతో కూడిన కమిటీలను నియమించాలని తెలిపారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో వసతులు లేకపోయినా, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికంగా సొమ్ము వసూలు చేసినా 1902 నంబరుకు ఫోను ద్వారా తెలియజేయవచ్చన్నారు. కలెక్టర్‌ ముత్యాలరాజు మాట్లాడుతూ కొవిడ్‌ కేర్‌ కేంద్రాల వద్ద 108 వాహనాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్పీ నారాయణ నాయక్‌, జేసీ (సంక్షేమం) తేజ్‌భరత్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. కొవిడ్‌ నియంత్రణ చర్యలపై సీఎం నిర్వహించిన వీడియో సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

కాల్‌ సెంటర్‌ పరిశీలన

కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్‌ను కొవిడ్‌-19 ప్రత్యేకాధికారిణి జయలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. కాల్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న దస్త్రాలను తనిఖీ చేశారు

కలెక్టర్‌సమీక్ష :జిల్లాలో కొవిడ్‌ రెరడో దశ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు.

విభాగాలవారీగా నోడల్‌ అధికారులు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా నోడల్‌ అధికారులను ఆయా విభాగాల వారీగా నియమిస్తూ కలెక్టర్‌ ముత్యాలరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ● కొవిడ్‌ ఆసుపత్రుల నిర్వహణ : డాక్టర్‌ జగదీష్‌, కొయ్యలగూడెం వైద్యాధికారి ● ఆహార ఏర్పాట్లు, పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలన: (కొవిడ్‌ ఆసుపత్రుల్లో) కె.రమేష్‌బాబు, డీపీవో (కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో) : డి.రాంబాబు, డ్వామా పీడీ ● ప్రైమరీ కాంటాక్టు ట్రేసింగ్‌ : ఎన్‌.తేజ్‌భరత్‌, జేసీ (సంక్షేమం), డాక్టర్‌ ప్రియాంక ● నమూనాల సేకరణ : డాక్టర్‌ జోషిరాయ్‌, జిల్లా సర్వైలైన్స్‌ అధికారి (ఇన్‌ఛార్జి) ● హెల్ప్‌ డెస్క్‌, సీసీ టీవీ పర్యవేక్షణ : డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌, డీసీహెచ్‌ఎస్‌ ● మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా, 104, 1902 సెల్‌ : పి.పద్మావతి, డీడబ్ల్యుఎంవో ● ల్యాబ్‌ నిర్వహణ : డాక్టర్‌ సీహెచ్‌ జగదీష్‌, తాడువాయి వైద్యాధికారి ● ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవల నిర్వహణ, ప్రైవేటు : డాక్టర్‌ ఆండ్రూ, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ● ఆసుపత్రుల్లో అధిక రుసుముల వసూళ్లపై పర్యవేక్షణ కొవిడ్‌ ఆసుపత్రుల్లో వసతుల కల్పన, మందుల నిర్వహణ : జె.ఉదయ్‌భాస్కరరావు, డీఆర్‌డీఏ పీడీ ● అవసరమైన మందుల నిర్వహణ పర్యవేక్షకురాలు : ఎస్‌కే అబిడ్‌ ఆలీ, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, లీలాకుమారి, డీఎం, హెచ్‌వో కార్యాలయ ● కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ : ఎం.వెంకటరమణ, డీసీవో ● రవాణా : సిరి ఆనంద్‌, డీటీసీ ● శాంతిభద్రతలు : మహేష్‌కుమార్‌, ఏఎస్పీ (ఏఆర్‌, ఆపరేషన్స్‌) ● ఓవరాల్‌ ఇన్‌ఛార్జి : డాక్టర్‌ సునంద, డీసీహెచ్‌ఎస్‌, డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌, డీసీహెచ్‌ఎస్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని