Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రైవేటే దిక్కు

ఉండీ ఉపయోగపడని ప్రభుత్వ ప్రయోగశాలలు


భీమవరంలో ఆక్వా ల్యాబ్‌

●భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన సత్యనారాయణ ఐదెకరాల ఆక్వా రైతు. ఏడాదికి మూడు సార్లు రొయ్యల సాగు చేస్తుంటారు. తరచూ నీటి, మట్టి నమూనాల పరీక్షలు చేయించుకోవడం కోసం పట్టణంలోని ప్రైవేటు ఆక్వా ప్రయోగశాలను ఆశ్రయించాల్సి వస్తుంది. కారణం భీమవరంలో ఉన్న ప్రభుత్వ ప్రయోగశాలలో పరీక్షలు చేసేవారు లేకపోవడం. నాలుగు సార్లు వెళ్లి వెనక్కి తిరిగా రావాల్సి వచ్చిందని ఆయన వాపోయారు.

మొగల్తూరు మండలానికి చెందిన ప్రసాదరావు మూడు నెలల కిందట ప్రభుత్వ ప్రయోగశాలలో నీటి నమూనా పరీక్షలు చేయించేందుకు వెళ్లారు. అక్కడ పరీక్షలు చేసేవారు లేరు. దీంతో నిరాశగా వెనక్కి వచ్చి ప్రైవేటు కేంద్రంలో చేయించుకోవాల్సి వచ్చింది.

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే : సిరుల పంట.. నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రధాన ఆదాయ వనరు.. ఇవీ ప్రభుత్వం ఆక్వా రంగం గురించి చెప్పే మాటలు. మరి అంతటి కీలక ఆక్వా రంగానికి చేయూతనివ్వడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రచార ఆర్భాటం తప్ప రైతులకు చేకూర్చే ప్రయోజనం పెద్దగా కనిపించడంలేదు. జిల్లాలో భీమవరం, ఆకివీడు, ఏలూరుల్లో సుమారు రూ.5.40 కోట్లతో ఆక్వా ప్రయోగశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2017లో వాటిని ప్రారంభించారు. కానీ వాటి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. వాటిలో ఎక్కడా పరీక్షలు నిర్వహించే వారు లేరు. చాలాకాలం నుంచి వాటి ద్వారా సేవలందే పరిస్థితి లేదు. ఫలితంగా రైతులు ప్రైవేటు ప్రయోగశాలలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా అక్కడ రెట్టింపు మొత్తాల్లో రుసుములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలోని 26 మండలాల పరిధిలో ఆక్వా సాగు విస్తరించి ఉంది. ఇందులో నీరు, మట్టి, బ్యాక్టీరియా, మేత నమూనా పరీక్షలు కీలకం. అవి చేయకుండా రైతులు సాగుకు ఉపక్రమిస్తే ఊహకందని నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఏ క్షణాన ఏ తెగులు వ్యాపిస్తుందో తెలియదు. అలాంటివి జరగకుండా ఉండాలంటే కనీస పరీక్షలు తప్పనిసరిగా చేయించాల్సిందే. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రయోగశాలలు మూడు చోట్లే ఉండగా అవి ప్రస్తుతం సేవలు అందించే పరిస్థితిలో లేవు. ఆయా కేంద్రాల్లో నిపుణులు లేరు. మత్స్య అభివృద్ధి అధికారులైనా ఆ విధులు నిర్వహిస్తారా అంటే దానికీ అవకాశం లేదు. ఎందుకంటే వారంతా నిత్యం క్షేత్రస్థాయిలో తిరుగుతూ విధులు నిర్వహించాలి. అలాంటి సమయంలో రైతులు నమూనా పరీక్షలు చేయించేందుకు వెళ్తే అక్కడ ఒక్కోసారి సమాధానం ఇచ్చేందుకు ఎవరూ ఉండని పరిస్థితి. కాగా, కొత్తగా నరసాపురం, పాలకొల్లు, మార్టేరు, భీమవరం, భీమడోలులో సమీకృత ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రూ.కోట్లు ఖర్చు చేసి ఏర్పాటుచేసిన పాత కేంద్రాలనే సక్రమంగా నిర్వహించలేని పరిస్థితుల్లో కొత్తవాటిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రయోజనం ఏమిటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.

అడిగే వారు లేరని.. ప్రైవేటు ప్రయోగశాలల ఏర్పాటుకు మత్స్య శాఖ అనుమతి తీసుకోవాలి. కొన్ని కేంద్రాల్లో పరీక్షలు చేసే వారికి తగిన అర్హతలు లేవనే ఆరోపణలున్నాయి. మరో పక్క రైతుల నుంచి పరీక్షల పేరిట ఇష్టారాజ్యంగా సొమ్ము వసూలు చేస్తున్నారు.ప్రైవేటు ల్యాబ్‌లు అధికారికంగా 200, అనధికారికంగా మరో 100 వరకూ నడుస్తున్నట్లు అంచనా.

త్వరలోనే పరిష్కారం..

ఆక్వా పరిశోధన కేంద్రాల్లో నిపుణుల కొరత గురించి రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదించాం. త్వరలోనే నియామకం జరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మత్స్య అభివృద్ధి అధికారులతో పరీక్షలు చేయిస్తున్నాం. మరిన్ని కేంద్రాలు అవసరం. -ఎ.చంద్రశేఖర్‌, ఇన్‌ఛార్జి సంయుక్త సంచాలకుడు, మత్స్య శాఖ, ఏలూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని