ఊపిరికి ప్రాణం పోస్తూ..
logo
Published : 09/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊపిరికి ప్రాణం పోస్తూ..

ఉభయ గోదావరి జిల్లాలకు సంజీవనిలా కేంద్రం

కొవ్వూరు రీఫిల్లింగ్‌ స్టేషన్‌ నుంచి ఆక్సిజన్‌ సరఫరా

సిలిండర్లలో ఆక్సిజన్‌ నింపుతున్న సిబ్బంది

జిల్లాకు కొవ్వూరులోని రీఫిల్లింగ్‌ స్టేషన్‌ నుంచే కాకుండా కృష్ణా జిల్లా కైకలూరు, గన్నవరంల నుంచి కూడా ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. కొవ్వూరులోని కేంద్రం పరిధిలోని ప్రాంతాలను మినహాయించి జిల్లాలోని మిగిలిన ప్రాంతాల ఆక్సిజన్‌ అవసరాలను ఆ రెండు కేంద్రాలు తీర్చుతున్నాయి.

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: కొవిడ్‌ రెండో దశలో ఆక్సిజన్‌ అవసరం అంతా ఇంతా కాదు.. మునుపెన్నడూ లేని విధంగా ప్రాణవాయువు అత్యవసరమైంది. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంజీవని కేంద్రంగా మారింది కొవ్వూరులోని ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ స్టేషన్‌. మూడేళ్ల కిందటే ఏర్పాటైన ఈ కేంద్రం రెండేళ్ల పాటు పరిశ్రమలు, ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేసింది. ఏడాది నుంచి కరోనా బాధితులకు సాంత్వన చేకూరుస్తోంది. 24 గంటల పాటూ పనిచేస్తున్న ఈ కేంద్రం పనితీరును పరిశీలిస్తే..

13 టన్నుల సామర్థ్యంతో..

కొవ్వూరు ఏటిగట్టు రహదారిని ఆనుకుని దండకుంట బైపాస్‌ మార్గంలో 2018 నవంబరు 11న ఎస్‌.వి.ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ స్టేషన్‌ను పడగ వీర్రాజు ప్రారంభించారు.

విశాఖపట్నం నుంచి ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్‌ను ఇక్కడికి తెచ్చి 13 టన్నుల సామర్థ్యం గల ట్యాంకరులో పోస్తారు. ప్రొసెసింగ్‌ ప్రక్రియ ద్వారా టెక్నీషియన్ల సమక్షంలో వాయువుగా మారిన ఆక్సిజన్‌ను సిలిండర్లలో నింపుతారు.

టన్ను ద్రవాన్ని వాయువుగా మార్చి వంద సిలిండర్లలో నింపుతారు. విశాఖ నుంచి 10 నుంచి 11 టన్నుల ద్రవం వస్తుంది. ట్యాంకరులో పూర్తిస్థాయిలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఉంటే గంటకు 40 సిలిండర్లు నిండే అవకాశం ఉంటుంది.

ఒక్కో సిలిండరులో ఏడు క్యూబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ నింపుతారు. స్టేషన్‌లో ఇద్దరు సీనియర్‌ ఫిల్లర్లు, ఇద్దరు సూపర్‌వైజర్లు, మరో ఇద్దరు డ్రైవర్లు, ఆరుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు.

దీని పరిధిలో..

పశ్చిమలో కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం డివిజన్ల పరిధిలోని ఆసుపత్రులు, ఏలూరు డివిజన్‌లోని తాడేపల్లిగూడెం, నల్లజర్ల ఆసుపత్రులకు ఇక్కడి నుంచి ప్రాణవాయువు నిత్యం సరఫరా అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో చాలా ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులతో పాటు కరోనా బారిన పడిన బాధితులకు ఈ స్టేషన్‌ నుంచి వెళ్లే ఆక్సిజన్‌ ప్రాణాలకు భరోసా ఇస్తోంది.

కొవ్వూరులోని ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ స్టేషన్‌

ప్రాణాలకు భరోసా..

కొవ్వూరులోని రీఫిల్లింగ్‌ స్టేషన్‌ సరఫరా చేస్తున్న ఆక్సిజన్‌ శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే వారి ప్రాణాలను నిలబెడుతోంది. ప్రైవేటు సంస్థ అయినా సామాజిక దృక్పథంతో అధికార యంత్రాంగానికి సహకరిస్తున్నారు. పంప్‌ కూలెంట్‌లోని పరికరం మరమ్మతులకు గురైతే తక్షణం చేయించి ఫిల్లింగ్‌ ప్రక్రియలో ఆటంకం లేకుండా చేశాం. అవసరమైన పరికరాన్ని హైదరాబాద్‌ నుంచి రప్పిస్తున్నాం. భద్రత ప్రమాణాలను అనుసరిస్తూ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. - డి.లక్ష్మారెడ్డి, ఆర్డీవో, కొవ్వూరు

వారంలో సరఫరా ఇలా..

కరోనా నేపథ్యంలో ఈ స్టేషన్‌ నుంచి ప్రభుత్వ, కొవిడ్‌ కేర్‌ ఆసుపత్రుల్లో అత్యవసర అవసరాల నిమిత్తం రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. వారం రోజుల్లో 3,755 సిలిండర్ల ఆక్సిజన్‌ను ఆయా ఆసుపత్రులకు వాహనాల్లో పంపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని