కరోనా పరీక్షలుఅనధికారికంగా చేస్తే చర్యలు
logo
Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పరీక్షలుఅనధికారికంగా చేస్తే చర్యలు

ఫలితాల్లో జాప్యాన్ని నివారిస్తాం

●●ఇంట్లో చికిత్స పొందే వారందరికీ కిట్లు అందిస్తాం

‘ఈనాడు’తో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

- ఈనాడు డిజిటల్‌, ఏలూరు

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అధికారులు నియంత్రణ చర్యల్లో నిమగ్నమయ్యారు. బాధితులకు చికిత్స అందించడంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వారు చెబుతున్నారు. కానీ యంత్రాంగం ఎంత చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పలు అంశాలపై లోపాలు కనిపిస్తున్నాయి. అనధికారికంగా కరోనా పరీక్షలు, చికిత్సలు, హోం ఐసోలేషన్‌ కిట్ల పంపిణీ, పరీక్షల ఫలితాల్లో జాప్యం, ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సలకు ఇబ్బందులు.. తదితర అంశాలను శనివారం ‘ఈనాడు’ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఎదుట ఉంచింది. ఆయా అంశాలపై ఆయన ఇలా స్పందించారు.

1. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలులో లోపాలు

కలెక్టర్‌: ఇందుకు జిల్లాలో మొత్తం 13 ప్రైవేటు ఆసుపత్రులను ఎంపిక చేశాం. వాటిలో తప్పనిసరిగా 50 శాతం పడకలను ఆరోగ్యశ్రీకి వినియోగించాలి. కొన్ని ఆసుపత్రుల్లో కరోనా బాధితులను చేర్చుకోవడం లేదనే ఫిర్యాదులు నా దృష్టికి కూడా వచ్చాయి. దీన్ని పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాం. ఆరోగ్యమిత్రలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆరోగ్యశ్రీలో అవకాశం ఉన్నా పడకలు ఖాళీ లేవని కృత్రిమ కొరత సృష్టించే ఆసుపత్రి యాజమాన్యాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రి రిసెప్షన్‌లో కూడా ప్రభుత్వ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

2. పరీక్షల ఫలితాల వెల్లడిలో జాప్యం

జాప్యం నివారణకు వీఆర్‌డీఎల్‌తో పాటు ర్యాపిడ్‌, ట్రూనాట్‌ పరీక్షలు మొదలు పెట్టాం. ట్రూనాట్‌ పరీక్షల్లో సాంకేతిక సమస్యలతో కచ్చితత్వం లోపిస్తోందంటున్నారు. దీని గురించి ఉన్నతాధికారులకు విన్నవించాం. త్వరలో పరిష్కారం అవుతుంది. వీఆర్‌డీఎల్‌ పరీక్షలు చేసేందుకు సేకరించిన నమూనాలు ఏలూరు తీసుకురావాల్సి ఉంది. దీంతో రవాణాకు ఇబ్బంది కలుగుతోంది. గతంతో పోలిస్తే ఫలితాలను వేగంగా వెల్లడిస్తున్నాం. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను పరిక్షించేందుకు ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తున్నాం. దీంతో చాలావరకు ఇబ్బంది తగ్గింది. ట్రూనాట్‌ పరీక్షలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే జాప్యం ఉండదు.

3. హోంఐసొలేషన్‌లో ఉన్నవారికి కిట్లు అందజేతలో ఆలస్యం

జిల్లాలో ప్రస్తుతం 7,131 మంది ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు. వీరిలో 7,021 మందికి కిట్లు అందించాం. మిగిలిన వారికీ అందిస్తాం. ప్రభుత్వం నుంచి ఇంకా ఎక్కువ కిట్లు రావాలి. అవసరానికి సరిపడా అందుబాటులో ఉండటం లేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 30 వేల కిట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించాం. త్వరలో వస్తాయి. అందరికీ అందిస్తాం.

4. జిల్లాలో అనధికారికంగా కరోనా పరీక్షలు, చికిత్స

ఈ విషయంలో అధికారుల నియంత్రణ కంటే ప్రజల్లో మార్పు ముఖ్యం. అనుభవం, పరిజ్ఞానం లేని వారి వద్ద చికిత్స చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. అనధికారికంగా పరీక్షలు, వైద్యం చేసేవారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. కొన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లను గుర్తించాం. వీరిపై కేసులు నమోదు చేస్తాం. మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసి తరచూ తనిఖీ చేయిస్తాం.

5. జిల్లాలో రోజువారీ మరణాలకు, ప్రకటిస్తున్న సంఖ్యకు వ్యత్యాసం

జిల్లాలో రోజూ సంభవిస్తున్న మరణాలను ప్రకటిస్తున్నాం. తక్కువ, ఎక్కువ చేసి చూపడం లేదు. కొందరు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది సరికాదు. ఆశ్రంలో రోజూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం చేస్తున్నారో ఆశ్రంలోనూ అదే తరహాలో సేవలు అందిస్తున్నారు. ఇటీవలి వరకు చేర్చుకునేందుకు ఆలస్యం జరుగుతుందనే ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ప్రస్తుతం ఆ సమస్యను నివారించాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని