చేప రైతులకు చిక్కే!
logo
Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేప రైతులకు చిక్కే!

ఆకివీడు మార్కెట్‌ 15 రోజుల పాటు మూసివేత  

ఎగుమతికి సిద్ధం చేసిన ట్రేలు

ఆకివీడు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆకివీడు హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ను కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో ఆదివారం నుంచి 15 రోజుల పాటు మూసివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బందుల పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై వర్తక సంఘం సభ్యులు చర్చలు జరుపుతున్నారు. ఈ మార్కెట్‌పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 500 మంది ఉపాధి పొందుతున్నారు. పశ్చిమ, కృష్ణా జిల్లాలు, కొల్లేరు ప్రాంతం నుంచి నిత్యం 80 టన్నుల వరకు వివిధ జాతుల చేపలు, రొయ్యలను ఈ మార్కెట్‌కు రైతులు తీసుకొస్తుంటారు. రోజువారీ లావాదేవీల విలువ రూ. 60 లక్షల పైమాటే. ఇక్కడి నుంచి ఒడిశా, పశ్చిమబంగ, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలకు చేపలు ఎగుమతి అవుతుంటాయి. మార్కెట్‌లో లావాదేవీలను నిలిపివేస్తే తమకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధికారులకు విన్నవిస్తాం..

కరోనా కట్టడిలో భాగంగా ఆకివీడు హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ను ఆదివారం నుంచి 15 రోజుల పాటు స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించాం. చెరువుల్లో ప్రాణవాయువు, ఇతర సమస్యలు ఉత్పన్నమైనప్పుడు రైతులు అత్యవసరంగా పట్టుబడులు పట్టి చేపలను ఈ మార్కెట్‌కు తీసుకొస్తుంటారు. అలాంటి సరకును ఒబ్బిడి చేయడానికి కాటాకు ముగ్గురు వ్యక్తులకు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలని అధికారులను కోరతాం. అవసరమైన సమయంలో మార్కెటింగ్‌ సదుపాయం లేకపోతే రైతులు నష్టపోతారు. ఈ అంశాన్ని అధికారులకు వివరించి వారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. హోల్‌సేల్‌ మార్కెట్‌ను మాత్రం మూసివేసే ఉంచుతాం. - షేక్‌ సుభానీ, అధ్యక్షుడు, భక్తాంజనేయ చేపల వర్తక సంఘం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని