కష్టకాలంలో ఇదేనా సాయం?
logo
Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కష్టకాలంలో ఇదేనా సాయం?

హెల్ప్‌డెస్క్‌ సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశం


ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతున్న కార్తికేయ మిశ్రా

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ‘ఆప్తులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని.. కరోనా కష్టకాలంలో సాయం కోసం బాధితుల బంధువులు ఫోన్‌ చేస్తే సరైన సమాచారం ఇవ్వడం లేదు.. ఎంతో కీలకంగా పని చేయాల్సిన హెల్ప్‌డెస్క్‌లపై ఫిర్యాదులు వస్తున్నాయి’ అని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా పనిచేయని సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిని శనివారం ఆయన ఆకస్మికరగా తనిఖీ చేశారు. పలు విభాగాలు, హెల్ప్‌ డెస్క్‌, ట్రేయాజింగ్‌ సెంటర్‌, ఆక్సిజన్‌ ప్లాంట్లను పరిశీలించారు. సిబ్బంది, బాధితుల బంధువులతో మాట్లాడారు. ఆసుపత్రిలో బాధితుల తాకిడి అధికమైన నేపథ్యంలో పడకలను 500కు పెంచాలని డీసీహెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహన్‌ను ఆదేశించారు.

ఆక్సిజన్‌ వృథా కాకుండా.. ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణకు ఓ అధికారిని నియమించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం ఎంత అందుబాటులో ఉంది.. ఇంకా ఎంత అవసరం.. తదితరాలతో నివేదిక ఇవ్వాలన్నారు. ఆసుపత్రుల వద్దకు వచ్చిన బాధితులను వెంటనే చేర్చుకోవాలని.. పడకలు ఖాళీ లేకుంటే సీఆర్‌రెడ్డి కళాశాల క్వారంటైన్‌ కేంద్రానికి తరలించాలని స్పష్టం చేశారు. ఎక్కువసేపు అంబులెన్సుల్లో ఉంచొద్దన్నారు. బాధితులకు వారి కుటుంబ సభ్యులు ప్రేమగా ఇంటి నుంచి పంపించే భోజనాన్ని అందించేలా చూడాలని సూచించారు. ఇందుకోసం ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోల సేవలను ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోల సేవలను వినియోగించాలన్నారు. అందరూ కష్టపడి పనిచేయాలని.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆక్సిజన్‌ జనరేటర్‌ ఏర్పాటు

ఆసుపత్రి ప్రాంగణంలోని లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ వద్ద ఇటీవల ఏర్పడిన సమస్యను 20 నిమిషాల్లోనే సరిచేశామన్నారు. ప్రాణవాయువు నిరాటంకంగా సరఫరా అయ్యేందుకు జనరేటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన మేర వినియోగించుకొని మిగిలినది ఇతర ప్రాంతాలకు సరఫరా చేసుకోవచ్చన్నారు. 15 క్యూబిక్‌ లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్‌ ఏర్పాటుకు ఓ దాత ముందుకొచ్చారని.. త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో సమస్య ఉత్పన్నం కాకుండా 10 కె.ఎల్‌. సామర్థ్యం కలిగిన స్టోరేజ్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ సంస్థల ఆధ్వర్యంలో జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో 100 నుంచి 150 పడకలకు ఆక్సిజన్‌ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రోజూ ఆసుపత్రిలో 60 నుంచి 70 మంది బాధితులు చేరుతుండగా.. 40 నుంచి 50 మంది డిశ్ఛార్జి అవుతున్నారని వివరించారు. అందుకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది సేవలందించాలని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని