పేదలకు సాయం అందే వరకు పోరాటం
logo
Published : 19/06/2021 02:38 IST

పేదలకు సాయం అందే వరకు పోరాటం

ప్రదర్శనలో పాల్గొన్న తెదేపా నాయకులు రామానాయుడు,

రామరాజు, రామమోహన్‌, రాధాకృష్ణ తదితరులు

నరసాపురం, నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.10 వేలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఆక్సిజన్‌ అందక చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి, బకాయిలను వెంటనే చెల్లించాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ అధినేత పిలుపు మేరకు నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నేతలు ప్రదర్శనగా వచ్చి స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆక్సిజన్‌ అందక ఎవరైనా చనిపోతే అది ప్రభుత్వ హత్యగా భావించాలన్నారు. ఇప్పటి వరకు అలా మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు. కరోనా రెండో దశ ఉద్ధృతితో పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నం అయ్యాయని తెలిపారు. జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, చిరువ్యాపారులు, వృత్తిదారులకు రూ.10 వేల సాయం చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో పేదలకు ఇస్తున్న సాయం ఇక్కడ కూడా అందించే వరకు తెదేపా పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్యశ్రీ వర్తించక పలువురు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోయారన్నారు. వారందరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టాలన్న యావ తప్ఫ. పేదలను ఆదుకునే పరిస్థితి లేదన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు బయట తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటుంటే ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌ వదిలి బయటకు రాని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి పొత్తూరి రామరాజు, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల సమన్వయకర్తలు మెంటే పార్థసారథి, వలవల బాబ్జి, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కొప్పాడ రవి, యు.రాంబాబు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు గుబ్బల నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం సబ్‌కలెక్టరు కార్యాలయ ఏవో వి.పోతనకు వినతిపత్రం అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని