ప్రజాహితం.. చెత్త రహితం!
logo
Published : 19/06/2021 02:38 IST

ప్రజాహితం.. చెత్త రహితం!

ఎంపిక చేసిన వార్డుల్లో అమల్లోకి కొత్త విధానం

జులై 8 నుంచి పూర్తిస్థాయిలో..

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే


భీమవరంలో ఎంపిక చేసిన ప్రాంతంలో చెత్త సేకరణ

ఇళ్లలో చెత్తను పొట్లాలుగా చుట్టి పక్కనే ఉన్న ఖాళీస్థలాల్లో పడేసేవారు కొందరైతే.. ప్లాస్టిక్‌ సంచుల్లో నింపి డ్రెయిన్లలోకి విసిరికొట్టేవారు మరికొందరు. దాదాపు అన్ని పట్టణాల్లోనూ ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తుంటాయి. నిత్యం ఇళ్లలో వచ్చే చెత్త నుంచి దుస్తులు, వస్తువులు, వ్యర్థ సామగ్రి, చెట్ల కొమ్మలు ఇలాంటివన్నీ నివాసాల చెంతనే రోడ్ల పక్కన గుట్టలుగా దర్శనమిస్తుంటాయి. ఇకపై ఇలాంటి పరిస్థితికి తెరపడనుంది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)లో భాగంగా పట్టణాలను చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో కొన్ని వార్డులను నమూనా ప్రాజెక్టులుగా ఎంపిక చేసి కొత్త విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను పురపాలక కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. జులై 8 నుంచి అన్ని వార్డుల్లోనూ అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

అవగాహన కల్పిస్తూ.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తున్నారు. సాధారణంగా పారిశుద్ధ్య కార్మికులు ఆయా వార్డుల్లో చెత్తను ఉదయం పూట సేకరిస్తారు. ఆ సమయంలోనే వారికి తడి, పొడి చెత్తలను నివాసితులు వేర్వేరుగా ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని రకాల వ్యర్థాలను కలిపి ఇస్తే సంబంధిత ఇంటి వద్దే వాటిని వేరుచేయడంతో పాటు నివాసితులకు కొత్త విధానంపై, సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన కల్పిస్తారు. మధ్యాహ్నం వేళ ప్రత్యేక సిబ్బంది ఆ వార్డుకు వెళ్లి డ్రెయిన్లను శుభ్రం చేయడం, రహదారుల వెంబడి ఉన్న చెట్ల కొమ్మలు, ముళ్లపొదలను తొలగిస్తారు.

రూ.కోట్ల అదనపు ఆదాయం

జిల్లాలో చింతలపూడి, ఆకివీడు నగర పంచాయతీలు మినహా మిగిలిన పట్టణాల్లో మొత్తం 1,74,454 ఆస్తిపన్ను అసెస్‌మెంట్లు ఉన్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే వీటి ద్వారా వినియోగ రుసుముగా ఏడాదికి దాదాపు రూ.8 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. ఈ రుసుమును సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుము విధిస్తారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేసినా, మల, మూత్ర విసర్జన చేసినా జరిమానాలు విధిస్తారు. ప్రభుత్వ ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తే పురపాలక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.

ఇంటింటా చెత్త సేకరణకు నెలకు రూ.90 చొప్పున చెల్లించాలి. ప్రతి నెలా 7వ తేదీలోపు ఈ మొత్తాన్ని చెల్లించకుంటే అపరాధ రుసుము విధిస్తారు.

మార్కెట్ల బయట చికెన్‌, మటన్‌ దుకాణాలకు రూ.300, చేపల విక్రయాలు చేసేవారు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

స్టార్‌ హోటళ్లకు విభాగాల వారీగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, లాడ్జిల్లో ఉన్న పడకలను బట్టి రూ.750 నుంచి రూ.5 వేల వరకు రుసుము ఉంటుంది.

ప్రైవేటు వాణిజ్య సముదాయాలకు రూ.1000 నుంచి రూ.2,500, ప్రైవేటు హాస్టల్స్‌కు రూ.1000. సినిమా థియేటర్‌ స్క్రీన్‌కు రూ.2,500 చొప్పున వసూలు చేస్తారు.

అన్ని రకాల కార్యాలయాలకు రూ.500, సూపర్‌ మార్కెట్లు, ఆటోమొబైల్‌ దుకాణాలకు రూ.750, విద్యాసంస్థలకు తరగతులు, విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.500 నుంచి రూ.3 వేల వరకు, క్లినిక్‌, లేబొరేటరీ, డిస్పెన్సరీలకు రూ.1500, ఆసుపత్రులకు పడకలను బట్టి రూ.2,500 నుంచి రూ.10 వేలు, కల్యాణ మండపాలకు విస్తీర్ణాన్ని బట్టి రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తారు.

చిన్న రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి నెలకు రూ.500, 501-1000 చ.అడుగుల విస్తీర్ణంలో ఉంటే రూ.1000, వెయ్యి చ.అడుగుల విస్తీర్ణం పైబడి ఉంటే రూ.1500 చొప్పున వసూలు చేస్తారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు రూ.3 వేల వరకు వినియోగ రుసుము ఉంటుంది.

రహదారుల పక్కన ఏర్పాటు చేసే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, మెస్‌లు, పండ్ల రసాల దుకాణాలకు రూ.300, బేకరీ, స్వీట్లు, తినుబండారాల దుకాణాలకు రూ.350, ఫర్నిచర్‌, అన్ని హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాలకు రూ.200 వరకు రుసుము ఉంటుంది.

త్వరలోనే వాహనాలు..

చెత్త వేసేందుకు ప్రతి ఇంటికీ ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగు డబ్బాలను ఇస్తారు. చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాలను పట్టణాలకు కేటాయిస్తూ పురపాలక పరిపాలన విభాగం నుంచి అనుమతులు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే ఈ వాహనాలను ప్రారంభిస్తారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చి సహకరించాలి. - ఎ.మోహనరావు, పురపాలక ఆర్డీ (రాజమహేంద్రవరం)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని