కార్తిక మాసంలో గృహ ప్రవేశాలు: మంత్రి
logo
Published : 19/06/2021 02:38 IST

కార్తిక మాసంలో గృహ ప్రవేశాలు: మంత్రి

లబ్ధిదారులతో మాట్లాడుతున్న శ్రీరంగనాథరాజు

ఆచంట, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకొని కార్తిక మాసంలో ప్రవేశాలకు సిద్ధం కావాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన శుక్రవారం ఆచంట మండలంలో పర్యటించారు. కొడమంచిలి చినపేట, ఆచంట పంచాయతీ పరిధి చెమ్మచెరువు, బాలంవారిపాలెంలోని జగనన్న లేఅవుట్లను పరిశీలించి.. అక్కడి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం కొడమంచిలిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గంలో సుమారు 10 వేల గృహాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఏకాదశి మంచి ముహూర్తం అని, ఆ రోజు పెద్ద సంఖ్యలో శంకుస్థాపనలు చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు. నిర్మాణ వ్యయం తగ్గించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాలంవారిపాలెం లేఅవుట్‌లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పలువురు లబ్ధిదారులు కోరగా.. అధికారులు దగ్గర ఉండి అన్నీ పనులు పర్యవేక్షిస్తారని, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

జగనన్న కాలనీల్లో నిబంధనలు అతిక్రమించి, ఇతరులను ఇబ్బంది పెట్టేలా గృహ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీరంగనాథరాజు హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఆచంట శివారు చెమ్మచెరువు లేఅవుట్‌లో పర్యటించిన సందర్భంగా అక్కడ నిర్మిస్తున్న రెండు ఇళ్లను పరిశీలించారు. చుట్టూ కనీసం అడుగు స్థలం వదలకుండా, ప్రభుత్వం నిర్దేశించిన కొలతలను అతిక్రమించి నిర్మాణం చేపడుతున్నట్లు గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విధంగా అనుమతి ఇచ్చారు, అసలు పర్యవేక్షణ ఉందా అని ప్రశ్నించారు. దగ్గర ఉండి కొలతలు వేయించారు. తక్షణమే రెండు ఇళ్లను తొలగించాలని ఆదేశించారు. ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడితే పక్క లబ్ధిదారులు ఇబ్బంది పడతారని చెప్పారు. గృహ నిర్మాణాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన ఏఈ, గ్రామ సచివాలయ అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ అధికారిని సస్పెండ్‌ చేయాలని డీఈ, ఎంపీడీవోలను మంత్రి ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని