వరద ముంపుపై నిర్దిష్ట కార్యాచరణ అవసరం
logo
Published : 19/06/2021 02:38 IST

వరద ముంపుపై నిర్దిష్ట కార్యాచరణ అవసరం

సమావేశంలో మాట్లాడుతున్న సంయుక్త కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

పోలవరం, న్యూస్‌టుడే: గోదావరి నదికి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకొని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై సంబంధిత శాఖల అధికారులు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. స్థానిక అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జలవనరుల శాఖ అధికారులతో పాటు పలు శాఖల జిల్లా అధికారులతో గోదావరి నదికి రానున్న వరదలు.. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-20 వరదల్లో చేపట్టిన పనులను పునఃసమీక్షించి భవిష్యత్తు కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ముంపు ప్రాంతాలకు ఎన్ని లక్షల క్యూసెక్కులు నీరొస్తే ఏయే గ్రామాలు ఖాళీ చేయాలి అన్న విషయమై జలవనరుల శాఖాధికారులు అంచనాలు వేశారని తెలిపారు. గతంలో కంటే అదనంగా ఆరు మీటర్లు వస్తుందని సూచించారని, క్షేత్ర స్థాయిలో ఎనిమిది మీటర్ల వరకు వచ్చినా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 19 గ్రామాలు వరదలకు మునిగే అవకాశాలున్నాయని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వరదల్లో చిక్కుకునే గ్రామాలకు నిత్యావసరాలు, మందులు, పారిశుద్ధ్య పనులకు అవసరమైన సామగ్రిని తరలించాలన్నారు. అవసరమైన ప్రదేశాల్లో బోట్లు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో, ఇన్‌ఛార్జి ఐటీడీఏ పీవో ప్రసన్నలక్ష్మి, ప్రాజెక్టు ఎస్‌ఈ నరసింహమూర్తి, నీటిపారుదల శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈలు ఎంఎస్‌ఎస్‌ రవిబాబు, వి.రామస్వామి, డి.రాజేంద్రప్రసాద్‌, ర.భ. శాఖ ఈఈ రాము, డీఎస్‌వో సుబ్బారాజు, డీపీవో రమేష్‌బాబు, డీఎంహెచ్‌వో సునంద, ఐసీడీఎస్‌ పీడీ విజయకుమారి, గృహ నిర్మాణ శాఖ ఈఈ తారాచంద్‌, సీఐ నవీన్‌నరసింహమూర్తి, తహశీల్దార్‌ సుమతి, ఎంపీడీవో శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని