పరిష్కరించకుంటే విధుల బహిష్కరణ
logo
Published : 19/06/2021 02:38 IST

పరిష్కరించకుంటే విధుల బహిష్కరణ

జిల్లా ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల నర్సులు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈ నెల 28న విధులు బహిష్కరిస్తామని ఒప్పంద, పొరుగు సేవల స్టాఫ్‌ నర్సులు ప్రకటించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించిన వీరు మాట్లాడుతూ కరోనా బాధితులకు సేవలందిస్తూ పలు సమస్యలను ఎదుర్కొంటున్నామని, వాటిని పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తోందన్నారు. విధులు నిర్వర్తిస్తూ కరోనా బారినపడి మరణించిన ఒప్పంద స్టాఫ్‌ నర్సుల కుటుంబాలకు రూ.50 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించడంతో పాటు కుటుంబంలోని ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నర్సులందరికీ ఒకే క్యాడర్‌, ఒకే వేతనాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఒప్పంద, పొరుగు సేవల స్టాఫ్‌ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.దయామణి, ఉపాధ్యక్షురాలు సులోచన, జిల్లా కార్యదర్శి లీలారాణి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని