ఏకలవ్య విద్యాలయానికి సొంత భవనం!
logo
Published : 19/06/2021 02:38 IST

ఏకలవ్య విద్యాలయానికి సొంత భవనం!

రూ.22 కోట్ల అంచనాతో పనులు

ఇప్పలపాడు వద్ద భవన నిర్మాణం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం ఏకలవ్య గిరిజన గురుకుల విద్యాలయానికి సొంత భవనం సమకూరనుంది. ఇప్పలపాడు వద్ద రూ.22 కోట్ల అంచనాతో భవన సముదాయ నిర్మాణ పనులు చేపట్టారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం మొదటి విడత పనులు మంజూరు చేసి నిధులు విడుదల చేసింది. భవన నిర్మాణానికి 19.64 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ విభాగం అధికారుల పర్యవేక్షణలో పనులు చేస్తున్నారు. బాలబాలికలకు విడివిడిగా 10 చొప్పున డార్మిటరీ బ్లాక్‌లు, భోజనశాల, ఎకడమిక్‌ బ్లాక్‌, ప్రహరీ నిర్మించనున్నారు. ప్రస్తుతం కాంక్రీట్‌ పిల్లర్ల దశలో పనులు ఉన్నాయి. 2019 జూన్‌లో కె.బొత్తప్పగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల భవనంలో ఈ పాఠశాలను ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గిరిజన గురుకుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఏకలవ్య విద్యాలయాల నిర్వహణ బాధ్యతలను నేషనల్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ ఎడ్యుకేషన్‌ విభాగానికి అప్పగించనున్నారు.

ఒక్కో విద్యార్థికి రూ.1.09 లక్షల ఖర్చు..

ఏకలవ్య పాఠశాలలో ఏటా 6వ తరగతిలో 30 మంది చొప్పున బాలబాలికలను చేర్చుకుంటున్నారు. ఇక్కడ చేరిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో పాఠ్యాంశాలు బోధిస్తారు. ఒక్కో విద్యార్థికి భోజన, వసతి తదితర సదుపాయాలకు ఏటా రూ.1.09 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఈ విద్యాలయంలో 6, 7 తరగతుల్లో 60 మంది చొప్పున విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి 30 మంది చొప్పున బాలబాలికలను 6వ తరగతిలో చేర్చుకుంటామని అధికారులు ప్రకటించారు. జిల్లాలోని గిరిజన విద్యార్థులకు 27, ఓసీ, బీసీ, ఎస్సీలకు ఒక్కో సీటు చొప్పున కేటాయించారు. ఈ నెల 16తో దరఖాస్తు గడువు ముగిసినా ఈ నెల 26 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్‌ వి.రమేష్‌ తెలిపారు. విద్యాలయ భవన నిర్మాణ పనులు చురుగ్గా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని