నిరీక్షణతోనే నీరసం
logo
Published : 19/06/2021 02:38 IST

నిరీక్షణతోనే నీరసం

మంజూరు కాని పీఎంఎంవీవై నిధులు

పెంటపాడు గ్రామ పరిధి కూనాకరపేటకు చెందిన సిర్రా అఖిల ఏడాది కిందట ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజనలో నమోదు చేసుకున్నారు. ఆమె ప్రసవించి తొమ్మిది నెలలు గడిచిపోగా ఇప్పటివరకు తొలి విడత నగదు రూ.వెయ్యి మాత్రమే బ్యాంకు ఖాతాలో జమైంది. మిగిలిన రెండు విడతల సొమ్ము రూ.4 వేల కోసం ఏఎన్‌ఎం, పీహెచ్‌సీ సిబ్బందిని అడుగుతున్నా ప్రయోజనం లేదు. ఆమె భర్త విజయ్‌ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పనులు కూడా ఉండటం లేదు. ఇలాంటి సమయంలో పీఎంఎంవీవై నిధులు విడుదల చేస్తే తన బిడ్డకు పౌష్టికాహారం సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతుందని అఖిల చెబుతున్నారు. ఇది ఈమె ఒక్కరి పరిస్థితే కాదు జిల్లాలో అనేకమంది గర్భిణులు, బాలింతలు ప్రభుత్వ సాయం కోసం నిరీక్షిస్తున్నారు.

ఏలూరు వన్‌టౌన్‌, తాడేపల్లిగూడెం, పెంటపాడు గ్రామీణ, న్యూస్‌టుడే

తల్లీ బిడ్డల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనను (పీఎంఎంవీవై) 2017 నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన గర్భిణులు, బాలింతలకు రూ.5 వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు. ఈ సొమ్ములతో తల్లీబిడ్డలు పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆరు నెలలుగా నిధులు విడుదల కాకపోవడంతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు.

మూడు విడతల్లో..

ఈ పథకాన్ని మొదటి కాన్పునకు మాత్రమే వర్తింపజేస్తారు. మూడు విడతల్లో రూ.5 వేలను లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. గర్భిణి అయిన వెంటనే ఆ ప్రాంతానికి చెందిన ఆశా కార్యకర్తకు తెలియజేయాలి. ఆమె ఏఎన్‌ఎం దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారు బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబర్‌, తల్లీబిడ్డ సంరక్షణ (ఎంసీపీ) కార్డు వివరాలను ఇవ్వాలి. ఏఎన్‌ఎం ఆ వివరాలతో దరఖాస్తు పూర్తిచేసి సంబంధిత పీహెచ్‌సీ వైద్యాధికారికి అందజేస్తే ఆయన ధ్రువీకరణ అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రిజిస్టర్‌ అయిన వెంటనే లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో రూ.వెయ్యి జమవుతుంది. అయిదో నెలలో వైద్య పరీక్షలు చేస్తే ఆరో నెలలో రూ.2 వేలు జమవుతుంది. బిడ్డ జన్మించాక మూడో టీకా వేయించిన అనంతరం మరో రూ.2 వేలు జమ చేస్తారు. గర్భిణి అయిన రెండేళ్ల వరకు ఈ పథకం వర్తిస్తుంది. వైద్యపరీక్షలు మాత్రం ప్రభుత్వ వైద్యాధికారితో చేయించుకోవాలి.

త్వరలో విడుదల

పీఎంఎంవీవై కింద నిధులు పది లేదా 15 రోజుల్లో విడుదలవుతాయి. లబ్ధిదారులెవరూ ఆందోళన చెందవద్ధు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు కొవిడ్‌ విధుల్లో ఉన్న కారణంగా లబ్ధిదారుల నమోదు ప్రక్రియ నెమ్మదించింది. అర్హులందరినీ పథకంలో నమోదు చేసి లబ్ధి అందేలా చేస్తా.  - సునంద, డీఎంహెచ్‌వో

రూ.10 కోట్లకు పైగా బకాయిలు

పీఎంఎంవీవై కింద నిధుల విడుదల గత డిసెంబరు 15 నుంచి ఆగిపోయింది. ఆరు నెలలుగా మంజూరు కాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సుమారు 25 వేల మంది లబ్ధిదారులకు రూ.10 కోట్లకు పైగా నిధులు చెల్లించాల్సి ఉంది. పోషకాహారం నిమిత్తం అందించే ఆర్థికసాయం కావడంతో దీని ప్రభావం తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

నమోదులోనూ వెనుకబాటు

ఈ పథకానికి నెలవారీ లక్ష్యాలను రాష్ట్ర ఉన్నతాధికారులు ఇస్తారు. జిల్లా నెలవారీ సగటు లక్ష్యం 1800 నుంచి 2 వేల వరకు ఉంటుంది. డిసెంబరులో 1900, జనవరిలో 1663, ఫిబ్రవరిలో 1724, మార్చిలో 1573, ఏప్రిల్‌లో 982, మేలో 437, జూన్‌లో ఇప్పటివరకు 498 మంది లబ్ధిదారులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీనిని బట్టి కొద్దినెలలుగా లబ్ధిదారుల వివరాల నమోదులో సిబ్బంది వెనుకబడ్డారని తెలుస్తోంది. సిబ్బంది కొవిడ్‌ విధుల్లో ఉన్న నేపథ్యంలో నమోదు ప్రక్రియ మందగించింది. ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి తమను పథకానికి అర్హులు చేయాలని ద్వారా లబ్ధిదారులు కోరుతున్నారు.

పథకంలో నమోదైన లబ్ధిదారులు 96,507 మంది

విడుదలైన నిధులు రూ. 38.06 కోట్లు

గత ఆర్థిక సంవత్సరంలో అర్హులు 18,363 మంది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని