వరద భయం.. పాకలతో అభయం
logo
Published : 19/06/2021 02:38 IST

వరద భయం.. పాకలతో అభయం

ప్రత్యామ్నాయ ఏర్పాటులో నిర్వాసితులు


కొండల్లో రాకపోకలకు దారి చేసుకుంటున్న గిరిజనులు

పోలవరం, న్యూస్‌టుడే : ఎగువ కాఫర్‌డ్యాంతో వరద మరింత పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం ముంపు గ్రామాలపై ఉంటుంది. సురక్షిత ప్రాంతాలను చూసుకోవాలన్న అధికారుల హెచ్చరికలతో కొండలపై పాకలు వేసుకుంటున్న నిర్వాసితులు ఇప్పుడు రాకపోకలకు వీలుగా మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలవరం మండలం 19 ముంపు గ్రామాల పరిధిలోని 3,311 కుటుంబాలకు ఇప్పటివరకు సుమారు 900 కుటుంబాల వారు పునరావాస కాలనీలకు వెళ్లారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తికాక, ప్యాకేజీ అందక, పలు సమస్యలకు పరిష్కారం దొరకని వారు బయటకొస్తే రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న అనుమానంతో గ్రామాలకు సమీపంలోని కొండలపై పాకలు వేసుకునే పనిలో పడ్డారు. వీరు ప్రత్యామ్నాయ మార్గ్గాలపై దృష్టిసారించారు. పోలవరం నుంచి 36 కిలోమీటర్ల దూరంలోని సిరివాక, కొరుటూరు, శివగిరి గ్రామాలవారు గెడ్డపల్లి మీదుగా రాకపోకలకు డాసన్‌ రోడ్డు ఉంది. గతంలో నిర్వాసితులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగించారు. అధికారులు నిత్యావసరాలను ట్రాక్టర్లపై ఈ మార్గంలోనే తరలించారు. ఇక చీడూరు, టేకూరు గ్రామాల వారు తవ్వు కాలువను పడవపై దాటి అక్కడి నుంచి వాడపల్లి, పెద్దూరు, గాజులగొంది, తల్లవరం మీదుగా ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించారు. ప్రస్తుతం ఆ మార్గం తుప్పలతో మూసుకుపోవడంతో వందలాది మంది గిరిజన యువతీ, యువకులు కొన్ని రోజులుగా బాట వేసే పనిలో ఉన్నారు.

రోజుల తరబడి వరద నిలిచిపోతే బయటకురావడం కష్టమని, టేకూరు నుంచి పోలవరం వెళ్లాలంటే ఊడతపల్లి, సున్నాలగండి మీదుగా కష్టమైనా మరో దారి లేదని గిరిజనులు చెబుతున్నారు. వర్షాలు పడి, వరదలు వచ్చిన తరువాత ఇబ్బందులు పడే కంటే గత అనుభవాల దృష్ట్యా ముందుగానే నిర్వాసితులు దారి చేసుకునే పనిలో పడ్డారు. ఇకపై గోదావరిలో ఇంజిన్‌ పడవలపై ప్రయాణం చేసే అవకాశం కనిపించడం లేదని, గతంలో కంటే వరద ఉద్ధృతంగా అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా ప్రవహిస్తుందని, తూర్పుగోదావరి జిల్లా వైపు నుంచి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని నిర్వాసితులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని