జాతరలో అశ్లీల నృత్యాలు
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

జాతరలో అశ్లీల నృత్యాలు

విధుల్లో నిర్లక్ష్యంపై సీఐ, ఎస్సై సస్పెన్షన్‌

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ఏలూరు శివారు గ్రామీణ ప్రాంతంలో ఓ జాతర ఊరేగింపులో అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని భావించిన పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత సీఐ, ఎస్సైను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఏలూరు రేంజ్‌ డీఐజీ కె.వి.మోహనరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 21న రాత్రి ఏలూరు మండలం పోణంగిలో గొంతేనమ్మ ఊరేగింపులో నిర్వాహకులు మహిళలు, హిజ్రాలతో అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. ట్రాక్టరుపై మహిళలు అసభ్యకరంగా నృత్యాలు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామీణ సీఐ అనసూరి శ్రీనివాసరావు, ఎస్సై చావా సురేష్‌ ఘటనా స్థలానికి తమ సిబ్బందితో వెళ్లారు. అప్పటికే నృత్యాలు చేసిన మహిళలు అక్కడున్న వారంతా పారిపోయారు. దీంతో నిర్వాహకులు 12 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. సంబంధిత పోలీసు అధికారులకు ముందుగా అక్కడ ఊరేగింపు జరుగుతుందని తెలిసినా బందోబస్తు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అశ్లీల నృత్యాలకు తెగబడ్డారని భావించారు. దీంతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సీఐ అనసూరి శ్రీనివాసరావు, ఎస్సై చావా సురేష్‌లను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అశ్లీల నృత్యాల వ్యవహారంతాడేపల్లిగూడెం మండలం కొత్తూరులో కూడా జరిగింది. దసరా సందర్భంగా ఇక్కడ అశ్లీల నృత్యాలు నిర్వహించారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో రికార్డింగ్‌ డ్యాన్స్‌కు వచ్చిన మహిళలకు ఆతిథ్యం ఇచ్చారని, మద్యం, బిర్యానీలు కూడా అందజేశారని తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ ఈ వీడియోలు వైరల్‌ కావడంతో హడావుడిగా కేసు నమోదు చేసిన పోలీసులు నిర్వాహకులను అరెస్టు చేశారు. అయితే దీనిపై పోలీసు అధికారుల పాత్రపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

వీఆర్‌కు జంగారెడ్డిగూడెం సీఐ

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం సీఐ గౌరీశంకర్‌ను పాలనా పరమైన కారణాలతో వీఆర్‌కు పంపినట్లుగా డీఐజీ మోహనరావు తెలిపారు. పెండింగ్‌ కేసులు పెరగడం, పురోగతి లోపించడం వీఆర్‌కు పంపడానికి కారణాలుగా చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని