సిమ్‌ కార్డు పట్టించింది
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

సిమ్‌ కార్డు పట్టించింది

హత్య కేసు నిందితుడి అరెస్టు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: కొన్ని నెలల క్రితం హత్య చేశాడు. ఆచూకీ లేకుండా తప్పించుకున్నాడు. హత్య చేసిన అనంతరం కొన్ని నెలలపాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాడు. చివరకు స్వగ్రామానికి వెళ్లిన తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలను భీమవరం గ్రామీణ సర్కిల్‌ సీఐ బి.కృష్ణకుమార్‌ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భీమవరం గ్రామీణ సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఉండిలో ఓ బహుళ అంతస్తు భవన నిర్మాణ పనులకు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన కన్నయ్యలాల్‌ మౌర్య, సహ్లాద్‌ సహానీ అనే ఇద్దరు వచ్చారు. నగదు విషయమై ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. 2020 నవంబరు 18 రాత్రి సహ్లాద్‌ సహాని నిద్రిస్తుండగా కన్నయ్యలాల్‌ మౌర్య కర్రతో కొట్టడంతో సహాని అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితుడు పారిపోయాడు. రాజమహేంద్రవరం, హైదరాబాదులలో తలదాచుకున్నాడు. ఘటన జరిగి కొన్ని నెలలు గడిచిపోవడంతో పోలీసులు మరిచిపోయారనుకున్నాడు. స్వస్థలానికి ఇటీవల చేరుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు గాలించినా వివరాలు లభించలేదు. ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశాలతో నరసాపురం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో సీఐ బి.కృష్ణకుమార్‌, ఎస్సై డి.రవికుమార్‌, సిబ్బందితో విచారణను ముమ్మరం చేశారు. గతంలో ఉపయోగించిన సిమ్‌కార్డు చిరునామా ఆధారంగా గోరఖ్‌పూర్‌ చేరుకుని నిందితుడైన కన్నయ్యలాల్‌ను పట్టుకున్నారు. భీమవరం రెండో అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌ కోరతామని సీఐ చెప్పారు. భీమవరం ఎస్సై పి.అప్పారావు, ఏఎస్సైలు కె.ధర్మారావు, సయ్యద్‌ బాజీ, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని