జీవన వేదన..!
eenadu telugu news
Updated : 24/10/2021 05:49 IST

జీవన వేదన..!

పెరిగిన ధరలతో విలవిల

విద్యాధరపురం, వన్‌టౌన్‌ (విజయవాడ), న్యూస్‌టుడే

గత ఏడాది అక్టోబర్‌లో రూ.680 మాత్రమే ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.950లు.

కొవిడ్‌ నేపథ్యంలో ఉపాధి కరవై.. కష్టంగా జీవనం సాగిస్తున్న సామాన్యులపై నిత్యావసరాల ధరల పెరుగుదల మరింత భారం మోపుతోంది. ఇది సంపాదనకు, ఖర్చులకు మధ్య వ్యత్యాసం పెంచి మధ్యతరగతి ప్రజానీకాన్ని అప్పులపాలు చేస్తోంది. ప్రస్తుతం కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వాటిని కొనుగోలు చేయాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోందని కొందరు వాపోతున్నారు. వీటికి తోడు గ్యాసు ధర గడచిన మూడేళ్లల్లో రెట్టింపు పెరిగి రూ.922కు చేరింది. మరోవైపు ఇంటి అద్దె చెల్లించడానికి అవస్థలు పడుతున్న క్రమంలో విద్యుత్తు బిల్లులు, ఇంటి పన్నులు, చెత్తపై పన్ను వేయడం కూడా పేదవర్గాల నడ్డి విరుస్తోంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో దాని ప్రభావం అన్ని రంగాలపైన పడింది. నిత్యం రద్దీగా ఉండే కాళేశ్వరరావు మార్కెట్‌, వస్త్రలత కాంప్లెక్సు, బీసెంటు రోడ్డు, లెనిన్‌ సెంటరులో వ్యాపారాలు లేక దుకాణాలు బోసిపోతున్నాయి.


నిత్యావసరాల ధరలు తగ్గించాలి..

కొవిడ్‌కు ముందు కాస్తో కూస్తో ధరలు పెరుగుతూ ఉండేవని స్థానిక గృహిణి శశికుమారి చెబుతున్నారు. ఆ సమయంలో ఏదోఒక పని దొరికేదని, తన భర్త, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నామన్నారు. నిత్యావసరాలైన సరకులు, పాలు, గ్యాస్‌ ధరలు పెంపుతో మధ్య, సామాన్య తరగతులపై భారం పడిందంటున్నారు. వంట నూనెల ధరలు పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.


బతికేదెలా..?

చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా గుప్తా సెంటర్‌కు చెందిన బాషా పెద్దగా చదువుకోలేదు. తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కర్ఫ్యూ సడలింపులు ఇచ్చినా.. వ్యాపారాలు ఆశించినంత లేవు. దీంతో ఇళ్ల దగ్గర, బయట ప్రాంతాల్లో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజంతా కష్టపడితే రూ.400 వస్తున్నాయని, ఇలా నెలకు రూ.12వేలు మాత్రమే సంపాదిస్తున్నారు. ఇంటి అద్దె, ఇతర ఖర్చులు పోగా ఏమీ మిగలడం లేదని వాపోతున్నారు.


అప్పుల పాలవుతున్నాం..

విజయవాడ పాతబస్తీ ప్రాంతానికి చెందిన రబ్బానీ ఆటో డ్రైవర్‌. భార్య, ఇద్దరు ఆడ పిల్లలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల కుటుంబమంతా కరోనా బారిన పడ్డారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేరి అప్పులు చేసి బిల్లులు చెల్లించారు. అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ ఇంధన ధరలు పెరగడంతో ఆటో నడపడం కష్టంగా మారింది. ఈ క్రమంలో నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో బతుకుబండి నడవడం ఇబ్బందిగా ఉంది. ఓ వైపు ఆదాయం చాలక మరోవైపు అప్పులకు వడ్డీలు చెల్లించలేక సతమతమవుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని