నవంబరులో జిల్లా స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం
eenadu telugu news
Published : 24/10/2021 05:13 IST

నవంబరులో జిల్లా స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం


కలెక్టర్‌ నివాస్‌తో సమావేశమైన ఏపీ ఎన్జీవో ఐకాస జిల్లా నాయకులు విద్యాసాగర్‌, ఇక్బాల్‌ తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నవంబరు మొదటి వారంలో ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ఎన్జీవో ఐకాస జిల్లా నాయకులు విన్నవించిన నేపథ్యంలో కలెక్టర్‌ స్పందించారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, జిల్లాకు మరింత పేరు తేవాలని ఉద్యోగులకు సూచించారు. నగరంలోని విడిది కార్యాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల జిల్లా ఐకాస అధ్యక్ష, కార్యదర్శులు ఎ.విద్యాసాగర్‌, ఎండీ ఇక్బాల్‌ తదితరులు శనివారం కలెక్టర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన సివిల్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏడాదిన్నర నుంచి నిర్వహించలేదన్నారు. ఈ క్రమంలో శాఖాపరమైన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని చెప్పారు. ఆరోగ్య కార్డులు, సర్వీసు సంబంధిత సమస్యలను పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పీఆర్‌, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్‌లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్‌ దృష్టికి తేగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టు సాగర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకాస కోశాధికారి ఎ.సాంబశివరావు, నాయకులు పి.రమేష్‌, బి.సతీష్‌కుమార్‌, సి.హెచ్‌.అప్పారావు, జె.స్వామి, వై.రవి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని