ఈతలో పతకాల వేట
eenadu telugu news
Published : 24/10/2021 05:13 IST

ఈతలో పతకాల వేట

 

న్యూస్‌టుడే-విజయవాడ క్రీడలు

సాధనలో జిల్లా క్రీడాకారులు

జిల్లా స్విమ్మర్లు రాష్ట్ర స్థాయిలో పతకాల పంట పండిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్తా చాటుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో గత ఏడాది నుంచి ఈత కొలనులు మూసివేశారు. అయినా నిరాశ చెందక నిత్యం ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. కొలనులు అందుబాటులో లేకపోవడంతో కృష్ణా నదిలో సాధన చేశారు. గత నెలలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్స్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని భళా అనిపిస్తున్నారు. ఈ ప్రతిభతో సీనియర్స్‌ కేటగిరీలో పలువురు స్విమ్మర్లు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ సీనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు.


పాక్‌ జలసంధి ఈదాలని...

అంతర్జాతీయ వేదికపై జాతీయ జెండాను ఎగురవేయడమే తన లక్ష్యమంటుంది నలంద విద్యానికేతన్‌లో +2 పూర్తి చేసిన సిద్ధి జైన్‌. తండ్రి అమిత్‌కుమార్‌ జైన్‌ వ్యాపారి. తల్లి హీనా జైన్‌ గృహిణి. సిద్ధి 2018లో గాంధీనగర్‌లోని సర్‌ విజ్జి నగరపాలక సంస్థ ఈత కొలనులో సాధన ప్రారంభించింది. అదే ఏడాది నగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 800మీ., 1500మీ. ఫ్రీ స్టైల్‌లో పసిడి, 200మీ., 400మీ. ఫ్రీ స్టైల్‌లో రజతం, 100మీ. ఫ్రీ స్టైల్‌లో కాంస్య పతకాలతో సత్తా చాటింది. రాష్ట్ర స్థాయి పోటీల్లో అయిదు పసిడి పతకాలతో పాటు వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. వీటితో పాటు పాక్‌ జలసంధి (28కి.మీ.)ని స్విమ్‌ చేసేందుకు కృష్ణా నదిలో తొమ్మిది గంటల పాటు కఠోర సాధన చేసింది. గత ఏడాది జలసంధిలోఈదేందుకు అనుమతి లభించినప్పటికీ కొవిడ్‌ కారణంగా చేసుకున్న ఏర్పాట్లను రద్దు చేసుకుంది. నరసరావుపేటలో అయిదు అంశాల్లో పసిడి పతకాలతో జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.


ఆస్తమా సమస్యను అధిగమించి...

మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బీఎస్‌సీ తృతీయ సంవత్సరం చదువుతున్న చింతలచెరువు జ్ఞానేశ్వరికి ఆస్తమా సమస్య ఉండడంతో, దాని నివారణకు తల్లిదండ్రులు శారద, తిరుపతిరెడ్డి ఎనిమిదేళ్ల వయసులో గురునానక్‌నగర్‌లోని వీఎంసీ ఈత కొలనులో వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించారు. అక్కడ బాగా రాణించడంతో కోచ్‌ సూచనలతో గాంధీనగర్‌లోని ఈత కొలనులో 2009లో సాధన ప్రారంభించింది. ఏడాదికే నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజత, ఒక కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. మరుసటి ఏడాది హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ పోటీల్లో ఏకంగా అయిదు పసిడి పతకాలు సొంతం చేసుకోవడంతో పాటు వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌తో మరో పసిడి పతకం సాధించింది. అప్పటి నుంచి రాష్ట్ర స్థాయిలో సుమారు 200కు పైగా పతకాలతో సత్తా చాటింది. జాతీయ స్థాయిలో రెండు కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు చదువులోనూ రాణిస్తోంది. బెంగళూరులో జరిగే జాతీయ సీనియర్స్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రతిభను ప్రదర్శించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నానంటుంది జ్ఞానేశ్వరి.


ఆసక్తితో నేర్చుకుని...

అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా సాధన కొనసాగిస్తున్నానంటున్నాడు కేబీఎన్‌ కళాశాలలో బీఎస్‌సీ పూర్తి చేసిన పిట్టా అరుణ్‌రెడ్ఢి తండ్రి రవిచంద్‌రెడ్డి ప్రైవేటు ఉద్యోగి కాగా.. తల్లి సరళ గృహిణి. పాఠశాల రోజుల్లో కరాటేపై ఆసక్తితో సాధన చేశాడు. మూడేళ్ల సాధనలో బ్రౌన్‌ బెల్ట్‌ సాధించాడు. 2012లో తల్లిదండ్రులతో కలిసి కేఎల్‌రావు పార్క్‌కి వెళ్లాడు. అక్కడి ఈత కొలనులో పలువురు స్విమ్మింగ్‌ చేయడం చూసి ఆసక్తిని పెంచుకున్నాడు. 2012లో వేసవి శిక్షణ శిబిరంలోచేరి సాధన ప్రారంభించాడు. తర్వాత తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో 100మీ బటర్‌ఫ్లైలో కాంస్య పతకం సాధించాడు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో 25 పతకాలు కైవసం చేసుకున్నాడు. అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీల్లో కృష్ణా వర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు పసిడి, ఒక రజతం, ఒక కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. మంచి స్విమ్మర్‌గా గుర్తింపు పొందడమే తన లక్ష్యమని అరుణ్‌రెడ్డి పేర్కొన్నాడు.


క్రీడా కోటాలో ఉద్యోగం

భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో స్థిరపడి కుటుంబానికి అండగా నిలవడమే తన లక్ష్యమంటుంది వెలివెల సాయిప్రియ. ఆమె తండ్రి మధుసూదనరావు ఉపాధ్యాయుడు, తల్లి ధనలక్ష్మి గృహిణి. వారికి ఇద్దరు ఆడపిల్లల్లో సాయిప్రియ పెద్ద కుమార్తె. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆరేళ్ల వయసులో గాంధీనగర్‌లోని ఈత కొలనులో స్విమ్మింగ్‌ సాధన ప్రారంభించింది. తొమ్మిదేళ్ల వయసులోనే కృష్ణానదిని అడ్డంగా 2.5 కి.మీ. ఈది ఔరా అనిపించింది. 2010లో నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా అయిదు పసిడి పతకాలు కైవసం చేసుకోవడంతో పాటు వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌తో మరో పసిడి పతకాన్ని దక్కించుకుంది. అప్పటి నుంచి పూల్‌లో దిగిన ప్రతిసారి పతకాలు తమ మెడలో అలంకారంగా మారాయి. పలు రాష్ట్ర, జాతీయ ఛాంపియన్‌షిప్పుల్లో వందకుపైగా పతకాలు సాధించింది. అఖిల భారత అంతర్‌ వర్సిటీ ఆక్వాటిక్‌ పోటీల్లో కృష్ణా వర్సిటీకి ప్రాతినిధ్యం వహించింది. దీంతో పాటు చదువులోనూ మంచి మార్కులతో రాణించింది. 2019లో సచివాలయ ఉద్యోగ నియామకాల్లో పోరంకి పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైంది. ఇటీవల ఏపీపీఎస్‌సీ గ్రూపు-3 పరీక్షల్లో అర్హత సాధించి క్రీడా కోటా ద్వారా ప్రకాశం జిల్లా డోర్నాల మండలం, నల్లగుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. గత నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో సీనియర్స్‌ కేటగిరీలో తలపడి ఒక పసిడి, రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకొని బెంగళూరులో జరిగే జాతీయ సీనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని