పచ్చని ప్రాంగణాలు
eenadu telugu news
Updated : 24/10/2021 06:36 IST

పచ్చని ప్రాంగణాలు

ఆ పాఠశాలల బాటలో నడుద్దాం

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే

నారాకోడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో హరిత సోయగాలు

ఆ పాఠశాలల ప్రాంగణాల్లోకి అడుగు పెట్టగానే మనసుకు హాయి గొలుపుతుంది... నందనవనాల్లోకి అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది... అవే పచ్చదనంతో అలరారుతున్న జిల్లాలోని సంగంజాగర్లమూడి, నారాకోడూరు, నంబూరు, చినకాకాని, వెనిగండ్ల తదితర విద్యాలయాల ప్రాంగణాలు...వీటిని రూపొందించడంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారికి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు... పచ్చలహారాలను మలచిన వీటి బాటలో మిగతావి నడిస్తే అటు పర్యావరణానికి, ఇటు విద్యా వాతావరణానికి మేలు చేసిన వారవుతారు.

జిల్లాలో విద్యాశాఖ పరిధిలో మొత్తం ప్రాథమిక పాఠశాలలు 2726, ప్రాథమికోన్నత 312, హైస్కూల్స్‌ 569 ఉండగా వీటిల్లో 4,12,672 మంది విద్యార్థులు చదువుతున్నారు. 15,010 మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు. ఇన్ని పాఠశాలలు ఉన్నా పచ్చదనం అభివృద్ధికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నా 10 శాతం కూడా దానిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. కొన్ని మాత్రమే విద్యార్థులను భాగస్వాములను చేస్తూ నందనవనాల్లా తీర్చిదిద్దుతున్నారు. మొక్కలు నాటి వదిలేయడం కాకుండా, నిర్వహణను విద్యార్థులకు అప్పగించి పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు.

* నారాకోడూరు జడ్పీ హైస్కూల్‌లో కొన్ని సంవత్సరాలుగా పచ్చదనం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు చలపతిరావు, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి మొక్కలు నాటించడంతోపాటు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. జాతీయ నాయకుల విగ్రహాలతోపాటు ఆహ్లాదం గొలిపే పచ్చదనం కనువిందు చేస్తుంది. ఈ వాతావరణంలోనే విద్యార్థులకు బోధన సాగిస్తున్నారు.

* సంగంజాగర్లమూడి జడ్పీ హైస్కూల్‌లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పాఠశాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడు శివరామకృష్ణ, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో మొక్కల పెంపకానికి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం ఒక ఉపాధ్యాయుడు ఆర్చి మెష్‌ను పాఠశాలకు బహూకరించారు. ఇలా మరికొన్ని విద్యా సంస్థల్లోనూ కృషి జరుగుతోంది. ఈ స్ఫూర్తి జిల్లా అంతటా అందుకోవాల్సి ఉంది.

సంగంజాగర్లవడి పాఠశాలలో.

ఇలా చేస్తే మెరుగు

* కేవలం పచ్చదనం అభివృద్ధే కాకుండా విద్యార్థులకు మార్గదర్శకం అయ్యేలా నీటి యాజమాన్యం, పొదుపు, వ్యర్థాల నిర్వహణ, విద్యుత్తు ఆదా వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉంది.

* పాఠశాల స్థాయిలో పచ్చదనం- పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తూ సమీక్షించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈరకంగా చేసేలా పాఠశాలలను ప్రోత్సహించి రేటింగ్‌ ఇచ్చి వారికి అదనపు నిధులు ఇస్తే మరింత సమర్థంగా అమలు చేసే అవకాశం ఉంటుంది.

* పర్యావరణ పరిరక్షణ, పచ్చదనంపై ప్రతి విద్యార్థిని భాగస్వాముల్ని చేస్తూ ఖాళీ సమయాల్లో మొక్కల పెంపకం, తోట పని వంటి వాటిల్లో క్రియాశీలకంగా చేసి ప్రోత్సహిస్తూ, వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రోత్సాహకాలు అందజేస్తే ఉపయోగంగా ఉంటుందని నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ జిల్లా సమన్వయకర్త తిరుపతిరెడ్డి చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని