‘కేంద్ర సర్కారు వినాశకర విధానాలకు రాష్ట్ర ప్రోత్సాహం’
eenadu telugu news
Published : 24/10/2021 06:21 IST

‘కేంద్ర సర్కారు వినాశకర విధానాలకు రాష్ట్ర ప్రోత్సాహం’

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలను రాష్ట్రం ప్రోత్సహిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి విమర్శించారు. శనివారం తెనాలిలో జరుగుతున్న పార్టీ జిల్లా మహాసభల ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీల పెంపు, ట్రూ అప్‌ ఛార్జీల విధింపు, వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి మీటర్ల ఏర్పాటు వంటివి ఈ ప్రక్రియలో భాగమన్నారు. కొవిడ్‌ కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పనిని పక్కన పెట్టి ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించడానికి ప్రాధాన్యత ఇవ్వడం దారుణమన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ సాగుతున్న భాజపా విధానాలను అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలో డిసెంబరు 27, 28, 29 తేదీల్లో పార్టీ రాష్ట్ర మహా సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీ నాయకుడు బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన ప్రధాన రాజకీయ పార్టీలు బూతులు మాట్లాడుకుంటూ తుదకు రాష్ట్రం పరువును దిల్లీలో తాకట్టు పెట్టేలా పంచాయతీలు చేయడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా పాశం రామారావు మరోమారు ఎంపికయ్యారు. సమావేశంలో కృష్ణయ్య, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ములకా శివసాంబిరెడ్డి, హుస్సేన్‌వలి, రాజ్యలక్ష్మి తదితరులతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని