ఆధ్యాత్మికం..సామాజికం
logo
Published : 26/04/2021 06:27 IST

ఆధ్యాత్మికం..సామాజికం

● శ్రీశుకబ్రహ్మాశ్రమ లక్ష్యం ●

 నేటి నుంచి ఆరాధనోత్సవాలు


శ్రీశుకబ్రహ్మాశ్రమంలో శివలింగాకృతిలో నిర్మించిన ఆశ్రమ వ్యవస్థాపకులు

శ్రీవిద్యాప్రకాశానందగిరి అధిష్ఠాన మందిరం

‘‘నిర్దేశించిన గమ్యాన్ని చేరుకోవాలంటే భయాన్ని విడిచిపెట్టు’’ ప్రపంచానికి శ్రీవిద్యాప్రకాశానందగిరి చాటిన నినాదమిది. ఈ అక్షర సత్యాన్ని నిజం చేస్తూ ఆధ్యాత్మికం, సామాజిక సేవ రెండు కళ్లుగా అడుగులు వేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీశుకబ్రహ్మాశ్రమం. ప్రస్తుతం కరోనా విపత్కర వేళల్లో సోమవారం నుంచి ఆశ్రమ ఆరాధనోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

శ్రీశుకబ్రహ్మాశ్రమం అంటే చటుక్కున గుర్తొచ్చేది ఆశ్రమ వ్యవస్థాపకులైన శ్రీవిద్యాప్రకాశనందగిరి రచించిన గీతామకరందం. అంతర్జాతీయ స్థాయిలో గీతామకరంద స్వామిగా ఆయనకు గుర్తింపు తెచ్చిందీ ఈ గ్రంథమే. కృష్ణాజిల్లా మచిలీపట్టణానికి చెందిన తూనుగుంట్ల రామస్వామి, సుశీలాదేవికి 1914 ఏప్రిల్‌ 13న ఆనందమోహన్‌(శ్రీవిద్యాప్రకాశనంద స్వామి) జన్మించారు. ఏర్పేడు మండలం వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీసద్గురు మలయాళస్వామి ప్రసంగాన్ని విని ఆయన మంత్రముగ్ధులయ్యారు. హింసకు దూరంగా.. సనాతన ధర్మ ప్రచారంతో ప్రజల్లో చైతన్యం తీసురావడం లక్ష్యంగా చేసుకున్నారు. సంస్కృతంలో ఉన్న యోగావశిష్ట రామాయణం, గీతాపారాయణం తదితర అంశాలను ఆపోశన పట్టారు. గురువాజ్ఞ మేరకు 1950లో వ్యాస భగవానుడి కుమారుడైన శుకబ్రహ్మ పేరుతో పవిత్ర సువర్ణముఖీ నదీ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.

అందరూ చదువుకునేలా..

సనాతన ధర్మ ప్రతీకగా.. భగవద్గీత ప్రత్యేకతను చాటుకుంది. ప్రతి ఒక్కరూ దీన్ని అధ్యయం చేయాలన్నది విద్యాప్రకాశనందుని సంకల్పం. సంస్కృత భాషలో ఉన్న భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా ఎంతో మధురంగా గీతామకరందం పేరుతో తెలుగులోకి అనువాదించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చిన ఈ దివ్య గ్రంథాన్ని తెలుగు, తమిళం, ఇంగ్లిషు, కన్నడం, హిందీ తదితర భాషల్లో ఆశ్రమ నిర్వాహకులు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సనాతన ధర్మ స్థాపనకు 108 గీతాయజ్ఞాలు నిర్వహించారు. 1988 ఏప్రిల్‌ 10న పార్ధివ శరీరాన్ని వదిలి మహాసమాధి పొందారు.

సేవకు పునరంకితం..

శుకబ్రహ్మాశ్రమం ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవకు తనవంతుగా కృషి చేస్తోంది. అక్షరాభివృద్ధే లక్ష్యంగా జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారు. శ్రీభక్తకన్నప్ప కంటి ఆస్పత్రి, త్రినేత్ర వైద్యాలయం ద్వారా పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. ఎందరికో కంటి చూపు కల్పిస్తున్నారు. ఆశ్రమం తరఫున ఉచిత యోగ విద్య కేంద్రం ఏర్పాటు చేశారు. యోగాసనాల శిక్షణతో ఆరోగ్యసిద్ధికి బీజం వేస్తున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకుల ఆశయమే లక్ష్యంగా ప్రస్తుత పీఠాధిపతులు శ్రీవిద్యాస్వరూపానందగిరి స్వామి ఆధ్యాత్మికత, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

ఏకాంతంగా వార్షికోత్సవాలు..

ఏటా ఘనంగా నిర్వహించే ఆశ్రమ వార్షికోత్సవాలను ఈసారి ఏకాంతంగా నిర్వహించాలని ఆరాధనోత్సవ సమితి నిర్ణయించింది. 26న ఆశ్రమంలోని అధిష్ఠాన మందిరంలో వెలసిన స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చన జరపనున్నారు. అలాగే 29న 108వ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అభిషేకం జరపనున్నారు. ఇవన్నీ ఏకాంతంగానే జరుగుతాయని భక్తులకు ఎలాంటి ఆహ్వానాలు లేవని ఆశ్రమ ఆరాధనోత్సవ సమితి స్పష్టం చేసింది.

ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీవిద్యాప్రకాశానందగిరి స్వామి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని