అవుటర్‌ యానం.. ఆహ్లాదభరితం
eenadu telugu news
Published : 14/06/2021 05:08 IST

అవుటర్‌ యానం.. ఆహ్లాదభరితం

11 నెలల్లోనే ఓఆర్‌ఆర్‌పై పరుచుకున్న పచ్చందాలు

కండ్లకోయ ఇంటర్‌ఛేంజ్‌ వద్ద పచ్చదనం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రాజధానికి మణిహారంగా ఉన్న అవుటర్‌ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్‌) రూపు మారుతోంది. కొత్త సర్వీసు రోడ్లు, ప్రధాన రహదారులకు మెరుగులద్దే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఈ హంగులకు తోడు రోడ్డెక్కితే ఎటు చూసినా కనుచూపుమేర పచ్చందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ రోడ్ల నిర్వహణ బాధ్యతను హెచ్‌ఎండీఏ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విద్యుద్దీపాలతోపాటు ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించింది. సరిగ్గా 11 నెలల్లోనే రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎటుచూసినా పచ్చదనం పరుచుకుంది.

నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకు

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌ నిర్వహణ అదే స్థాయిలో ఉండేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రధాన రహదారి, సర్వీసు రోడ్లను శుభ్రం చేసే బాధ్యత ఏజెన్సీలదే. ప్యాకేజీ-1లో పెద్ద అంబర్‌పేట నుంచి శంషాబాద్‌ ఇంటర్‌ఛేంజ్‌ వరకు, ప్యాకేజీ-2లో గచ్చిబౌలి నుంచి పటాన్‌చెరు వరకు విభజించారు. ఇందుకు టెండర్లు పిలిచారు. ఈనెల 15వ తేదీ వరకూ దాఖలుకు అవకాశం ఇచ్చారు.

ఏడాదిలోపే రూపుమారింది: అర్వింద్‌కుమార్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి

ఏడాదిలోపే ఓఆర్‌ఆర్‌ రూపుమారింది. హెచ్‌జీసీఎల్‌(హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌) బృందం హరితహారం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టింది. అన్ని ఇంటర్‌ఛేంజ్‌లు, మీడియన్లతో పాటు రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ పకడ్బందీగా చేయడంతో అంతటా పచ్చదనం పరుచుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని