ఉపాధి పోయింది.. ఊపిరి తీసింది
eenadu telugu news
Published : 14/06/2021 05:27 IST

ఉపాధి పోయింది.. ఊపిరి తీసింది

వేర్వేరు చోట్ల ఇద్దరి ఆత్మహత్య

జవహర్‌నగర్‌, కీసర, న్యూస్‌టుడే: కరోనా, లాక్‌డౌన్‌పరిస్థితుల వల్ల ఉన్న ఉపాధి పోయి, ఆర్థిక ఇబ్బందులు తదితర సమస్యలు చుట్టుముట్టడంతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు బలవన్మరణం చెందారు. జవహర్‌నగర్‌, కీసర ఠాణాల పరిధిలో ఈ ఘటనలు జరిగాయి. జవహర్‌నగర్‌ సీఐ భిక్షపతిరావు, ఎస్సై ప్రసాద్‌; కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇంట్లో ఒకరు...

శ్రీనివాసచారి(37), భార్య ఇద్దరు పిల్లలతో కలిసి బీజేఆర్‌నగర్‌లో ఉంటున్నారు. సికింద్రాబాద్‌లోని బోర్‌వెల్‌ దుకాణంలో పనిచేస్తున్నారు. కొంతకాలంగా పనిలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు రూ.4.5 లక్షలు అప్పు చేశాడు. మద్యానికి బానిసయ్యాడు. కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. పని చేయకపోవడం, మద్యానికి బానిసగా మారడంతో మూడు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవలు జరిగాయి. భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. శనివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనివాసచారి ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇంటి ఎదురుగా ఉన్న లక్ష్మీనారాయణ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే చేరుకుని తలుపులు పగలగొట్టి కాప్రాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెంచర్‌లో చెట్టుకు ఉరేసుకొని మరొకరు..

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నేరేడుపల్లికి చెందిన పైడాల వెంకట్‌రెడ్డి(47) పదిహేనేళ్ల క్రితం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నాగారానికి వలసొచ్చారు. రాంపల్లిలో సిమెంట్‌ ఇటుకల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరి పరిశ్రమకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏడాది కాలంగా పరిశ్రమ సక్రమంగా నడవకపోవడంతో అప్పులు పెరిగాయి. రాంపల్లి శివారులోని శిల్ప వెంచర్‌లో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన చావుకు ఎవరూ కారణం కాదని హిందీలో రాసిన సూసైడ్‌ నోట్‌ పై తెలుగుతో సంతకం ఉండడంపై వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్య పైడాల తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని