అనారోగ్యంతో వృద్ధురాలి మృతి.. మరునాడే ఇద్దరు మనవళ్ల దుర్మరణం
eenadu telugu news
Published : 27/07/2021 02:23 IST

అనారోగ్యంతో వృద్ధురాలి మృతి.. మరునాడే ఇద్దరు మనవళ్ల దుర్మరణం

ద్విచక్ర వాహనాన్ని వ్యాన్‌ ఢీకొనడంతో దుర్ఘటన


బి.విష్ణు                                 పి.మణికంఠ

గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: కౌమార వయసు వారిది.. ఒకరికి నానమ్మ.. మరొకరికి అమ్మమ్మ వరుస అయ్యే వృద్ధురాలు మృతి చెందడంతో ఆదివారం ఆమె అంత్యక్రియల్లో బాధాతప్త హృదయాలతో మనవళ్లు పాల్గొన్నారు. మరుసటి రోజు సోమవారం మనవళ్లిద్దరూ పొలం నుంచి పాలు తీసుకొని ద్విచక్ర వాహనంపై వస్తుండగా వ్యాను ఢీకొని కుర్రాళ్ల ఉసురు తీసింది. పెద్దదిక్కు పోయిన ఆవేదనలో ఉన్న ఆ రెండు కుటుంబాల్లో ఈ దుర్ఘటన మరింత విషాదాన్ని నింపింది. వారిద్దరి బంగారు భవిష్యత్తును కలలు కన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాలు.. గజ్వేల్‌ మండలం ధర్మారెడ్డిపల్లికి చెందిన పిట్ల సత్యనారాయణ దంపతులకు కుమారుడు మణికంఠ(16), కుమార్తె ఉన్నారు. గజ్వేల్‌లో బాకి శ్రీనివాస్‌ దంపతులకు కుమారుడు విష్ణు(17), కుమార్తె ఉన్నారు. యువకులిద్దరూ ఇంటర్‌ చదువుతున్నారు. సత్యనారాయణకు అత్తమ్మ.. శ్రీనివాస్‌ అమ్మ ఆదివారం మృతి చెందగా రెండు కుటుంబాలు గజ్వేల్‌లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నాయి. సోమవారం ఉదయం మణికంఠ, బావమరిది విష్ణు ఇద్దరూ ద్విచక్ర వాహనంపై గజ్వేల్‌ శివారులోని పొలం వద్దకు వెళ్లి పాలు తీసుకొని తిరిగొస్తున్నారు. పట్టణంలోని తూప్రాన్‌ చౌరస్తా వద్ద వ్యాన్‌ ఎదురుగా ఢీకొట్టగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఆసుపత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ లక్ష్మక్కపల్లి ఆర్వీఎంలో మణికంఠ, హైదరాబాద్‌లో విష్ణు చనిపోయారు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని