ఔటర్‌పై కారు దగ్ధం.. ఒకరి సజీవ దహనం
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

ఔటర్‌పై కారు దగ్ధం.. ఒకరి సజీవ దహనం

 

శంషాబాద్‌, న్యూస్‌టుడే: బాహ్యవలయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారులో మంటలు చెలరేగడంతో వ్యక్తి సజీవ దహనమైన సంఘటన శనివారం రాత్రి శంషాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధి హమీదుల్లానగర్‌ సమీపంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌ నుంచి తుక్కుగూడ వైపు ఓ వ్యక్తి కారు(ఏపీ 27 సీసీ 0206)లో బయలుదేరాడు. హమీదుల్లానగర్‌ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా కారులో మంటలు ఎగిసి పడ్డాయి. కారు నడిపిస్తున్న సదరు వ్యక్తి తప్పించుకోవడానికి యత్నిస్తుండగానే మంటల్లో చిక్కుకొని దహనమయ్యాడు. తోటి వాహనదారులు, ఔటర్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది మంటలను ఆర్పడానికి యత్నించారు. అందరూ చూస్తుండగానే వాహనం అగ్నికి ఆహుతైంది. కారులో ఉన్న మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఈ కారు షాద్‌నగర్‌, కరీంనగర్‌ ట్రాఫిక్‌ ఠాణాల పరిధిలో.. నిబంధనలను ఉల్లంఘించడంతో రెండు చలానాలు కలిపి రూ.వెయ్యి పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని