అడిగిందే తడవు.. అప్పగించారు!
eenadu telugu news
Updated : 19/09/2021 11:14 IST

అడిగిందే తడవు.. అప్పగించారు!

రూ.400 కోట్ల స్థలాన్ని ఉచితంగా కట్టబెట్టారు

రహదారికి ప్రత్యామ్నాయంగా నిర్మాణ సంస్థకు 4 ఎకరాలు కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో ఎకరా భూమి రూ.50-100 కోట్ల వరకూ పలుకుతుంది. ఖరీదైన ప్రాంతాల్లో రెట్టింపు ధర చెల్లించేందుకు స్థిరాస్తి/నిర్మాణ సంస్థలు పోటీపడుతుంటాయి. అంతటి విలువైన చోట గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సర్దుబాటు చేసేందుకు రూ.800 కోట్ల విలువైన 10 ఎకరాల స్థలాన్ని కేవలం రూ.222 కోట్లకు కట్టబెట్టారు. అదే నిర్మాణ సంస్థ తాము ప్రజల కోసం నిర్మించిన రహదారిలో కోల్పోయిన 4 ఎకరాల స్థలానికి ప్రత్యామ్నాయంగా అదే ప్రాంతంలో ఉచితంగా స్థలం కేటాయించమంటూ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఆగమేఘాలపై స్పందించిన అధికార యంత్రాంగం రూ.400 కోట్ల విలువైన 4 ఎకరాల 18 గుంటలను సదరు నిర్మాణ సంస్థకు ఉచితంగా దారాదత్తం చేసింది. ఇటీవల ఇ-వేలం ద్వారా ప్రభుత్వ స్థలాలను విక్రయించి కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుకోగలిగింది. అంతటి ముందుచూపుతో వ్యవహరించిన ప్రభుత్వం.. నష్టమని తెలిసినా విలువైన భూమిని ఉచితంగా కేటాయించటం చర్చనీయాంశంగా మారింది. ప్రజా ప్రయోజనార్థం కేటాయింపులు జరిగినట్టయితే సమస్య తలెత్తేది కాదు. ఈ వ్యవహారం వెనుక చోటుచేసుకున్న సంఘటనలు.. నిర్మాణం సంస్థ భూ కేటాయింపునకు చేసిన వినతులు విభిన్నంగా ఉండటం గమనార్హం.

ఇదీ అసలు సంగతి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హయాంలో బాచుపల్లిలో సర్కారు స్థలాల విక్రయానికి 2013లో ఇ-వేలం ద్వారా టెండర్లు ఆహ్వానించింది. నగరానికి చెందిన ఓ ప్రయివేటు నిర్మాణ సంస్థ కూడా ఈ-వేలంలో పాల్గొంది. భూములను దక్కించుకున్న సంస్థ కొంతమేర నగదు చెల్లించింది. అనంతరం ఆ స్థలంపై వివాదాలు చుట్టుముట్టాయి. దీనిపై ఇరువర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2019లో సదరు నిర్మాణ సంస్థకు అప్పుడు చెల్లించిన నగదు, వడ్డీ చెల్లించాలని, లేనిపక్షంలో అదే ధరకు విలువైన భూమిని కేటాయించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. దీని ప్రకారం తమకు ఫిలింనగర్‌లోని 10 ఎకరాల స్థలం కావాలంటూ నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఎకరా రూ.22 కోట్ల చొప్పున 10 ఎకరాలకు రూ.220 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం ఖరారైంది.

తక్కువ ధరకే కేటాయింపు

మహానగరంలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌ ప్రాంతాల్లో స్థలాలకు ఎంతో డిమాండ్‌ ఉంది. ఇంతటి డిమాండ్‌ ఉన్న ఫిలింనగర్‌-షేక్‌పేట వెళ్లే మార్గంలోని సర్వేనెంబరు 403లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నకిలీ హౌసింగ్‌ సొసైటీల స్వాహా యత్నాలకు అధికారులు అడ్డుకట్ట వేశారు. దీనిలో డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(దిల్‌) ఆధీనంలోని 10 ఎకరాలను నిర్మాణ సంస్థకు కేటాయించారు. రూ.220 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో అధికారులు ఆ స్థలాన్ని నిర్మాణ సంస్థకు అప్పగించారు. రూ.800 కోట్లు విలువైన భూమిని కేవలం రూ.220 కోట్లకే కేటాయించటం చర్చనీయాంశంగా మారింది. అక్కడ బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు కొండలు, గుట్టలు తొలగిస్తున్నారు. కొండపై ఉన్న హనుమాన్‌ ఆలయాన్ని తొలగించడంతో వివాదం మొదలైంది. పలు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. అధికారుల సంప్రదింపులతో ఎట్టకేలకు వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్టయింది.

4 ఎకరాల 18 గుంటలు..

తమకు కేటాయించిన స్థలంలో నిర్మాణ సంస్థ 100 అడుగుల రహదారి నిర్మాణం చేపట్టింది. ఫిలింనగర్‌ వైపు నుంచి పద్మాలయ స్టూడియో మీదుగా ప్రశాసన్‌నగర్‌ వరకూ 4 ఎకరాలు అవసరమవుతుందని గుర్తించారు. తాము నిర్మిస్తున్న రహదారి ప్రజలకూ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరో 4 ఎకరాలు కేటాయించాలంటూ సదరు నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి విన్నవించుకుంది. తాము నష్టపోయిన 4 ఎకరాలకు బదులుగా అదే ప్రాంతంలో 4 ఎకరాల 18 గుంటలు ఉచితంగా ఇవ్వాలంటూ కోరింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం 4 ఎకరాల 18 గుంటల స్థలాన్ని దిల్‌కు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేసింది. దిల్‌ ద్వారా సదరు నిర్మాణ సంస్థకు అప్పగించాల్సిందిగా రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన ప్రాంతంలో ఎకరా విలువ సుమారు రూ.90-100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.400 కోట్లు మేర గండిపడినట్టే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని