సరిహద్దులు దాటుతున్న కూలీలు
eenadu telugu news
Published : 28/09/2021 02:08 IST

సరిహద్దులు దాటుతున్న కూలీలు

పనులకు కర్ణాటక పయనం

స్థానిక రైతులకు తప్పని తిప్పలు

 


పత్తి పొలంలో కలుపు తీస్తున్న మహిళలు

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: కూలీల రోజూ పక్కరాష్ట్రంలో పనులకు వెళ్లడంతో.. ఇక్కడి అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైతులు వర్షాధారంగా సాగు చేసిన కంది, పత్తి పంటల్లో కలుపుతీత పనులతో పాటు వరిలో కలుపు తీయడం, పెసర, అలసంద, మినుము పంటలు సైతం ఒకే సారి కోతకు రావడంతో కూలీలకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. కర్ణాటక రాష్ట్రంలో రోజుకూలీ రూ.500 వరకు లభించడం, ప్రయాణ సౌకర్యం ఉచితంగా కావడంతో చాలా వరకు అటువైపు వెళ్తున్నారు.

ఇదిగో ఇలా..

మన సరిహద్దు నుంచి కర్నాటక రాష్ట్రం కేవలం ఆరు కిలోమీటర్లే ఉంది. దౌల్తాబాద్‌ మండలానికి సమీపంలోని గ్రామాలు.. ఆ రాష్ట్రంలోని కసూర్తిపల్లి, రెబ్బన్‌పల్లి, కోట్రిక ఉన్నాయి. అక్కడి రైతులంతా.. ఈ ప్రాంత కూలీలపైనే ఆధారపడతారు. ఇక అంతారం గ్రామం నుంచి కర్ణాటకలోని మెతుకు, యానగుంది. తదితర గ్రామాలకూ చాలా మంది వెలుతున్నారు. అక్కడ పత్తిలో కలుపు పెసర, మినుము పంటలు కోతకు రావడంతో కూలీలకు అధికంగా వెచ్చించడంతో పాటు వాహన సౌకర్యం కల్పించడంతో కూలీలంతా అక్కడికే వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో కూలీల సమస్య వేధిస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ సమారుగా వేయి మంది కూలీలు అక్కడికి వెళ్లి వస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

అదనంగా చెల్లింపులు..

దౌలతాబాద్‌లోని రైతులు రోజుకు రూ.250 ఉన్న కూలీకి రూ.300 నుంచి రూ.350 చెల్లించి మరీ పనులు చేయించుకుంటున్నారు. వరి కలుపులకు రూ.500 ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాగుకు పెట్టుబడుల భారం పెరిగి ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. జులై మాసంలో వర్షాలు అంతగా పడక పోవడంతో మినుము, పెసర పంటలు5 అంతంత మాత్రంగానే ఉన్నాయి. పెరిగిన కూలీలకు పంట నూర్పిడి చేసి విక్రయిస్తే పెట్టిన పెట్టుబడులు సైతం పై బడతాయంటున్నారు.

యంత్రాలు ఏవీ?

ఇటీవల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూలీల సమస్య ఉంది. దీన్ని దూరం చేయడానికి సర్కారు యాంత్రికీకరణ చేస్తామని చెబుతుంది. అధికారులు పల్లెల్లో కలుపుతీత యంత్రాలు రాయితీపై రైతులకు ఇస్తామని చెప్పారు. కానీ వాటిని అందించడం లేదు. అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నదాతలు కోరుతున్నారు.

పక్షం రోజులుగా ఎదురు చూస్తున్నా..

- వెంకటప్ప, రైతు.దౌల్తాబాద్‌

వరిలో కలుపు తీయడానికి కూలీల కోపం 15 రోజులుగా ఎదురు చూస్తున్నా. ఈ రోజు.. రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వరినాటు వేసి 35 రోజులు దాటింది. నాటు వేయడానికి ఎకరాకు రూ.4 వేలు ఇచ్చాం, కలుపు తీయడానికి రూ.2,000 ఇవ్వాలంటున్నారు. దీంతో సాగు భారమై పెట్టుబడులు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నా..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని