పొంగుతున్న వాగులు.. వంకలు
eenadu telugu news
Published : 28/09/2021 02:08 IST

పొంగుతున్న వాగులు.. వంకలు

తుపాను ప్రభావంతో భారీ వర్షం

అప్రమత్తమైన అధికారులు

కలెక్టర్‌ కార్యాలయంలో సహాయక కేంద్రం: 63059 54956

కందనెల్లి వద్ధ..

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: గులాబ్‌ తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వికారాబాద్‌, ధారూర్‌, పెద్దేముల్‌, తాండూరు, బషీరాబాద్‌, యాలాల మండలాల్లో సాయంత్రం 7 గంటల నుంచి దాదాపు గంటన్నర పాటు ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా కురవడంతో వికారాబాద్‌, తాండూరు పట్టణ రహదారులు కాల్వలను తలపించాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. ధారూర్‌ మండలం దోర్నాల్‌, స్టేషన్‌ ధారూర్‌ మధ్య దోర్నాల్‌ వాగులో వరద వచ్చే అవకాశం ఉండటంతో గ్రామాల్లో అటుగా ఎవరూ వెళ్ల వద్దని డప్పు చాటింపు వేయించారు. పోలీసు సిబ్బందితో కలిసి సర్పంచులు, పంచాయతీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పెద్దేముల్‌ మండలంలో కందనెల్లి తండాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. మర్పల్లి, కొడంగల్‌, బొంరాస్‌పేట్‌, పరిగి తదితర మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. అర్దరాత్రి దాటాక వాగులు పొంగే అవకాశం ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తుపాను పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. యంత్రాంగం అంతా అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ నిఖిల ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, విద్యుత్తు, రహదారులు, జలవనరులు ఇతర శాఖల అధికారులతో గ్రామ, మండల, స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, జడ్పీసీఈఓ ఇతర అధికారులు అప్రమత్తమయ్యారు. వాగులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. కొడంగల్‌ నియోకవర్గంలో రోజంతా ముసురే కురిసింది. రాత్రి 8 గంటల సమయానికి జిల్లాలో అత్యధికంగా పూడూరు మండలం పెద్దఉమ్మెంతాల్‌లో 7.8 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, బషీరాబాద్‌లో కేవలం 8 మిల్లీమీటర్లే నమోదైంది. ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న పత్తి, మొక్కజొన్న పంటలకు ఈ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి.


తాండూరు- చించోళి రహదారి దుస్థితి ఇలా..

రాకపోకలు నిలిపివేత..

పెద్దేముల్‌, న్యూస్టుడే: కందనెల్లి, మన్‌సాన్‌పల్లి, గాజీపూరు వాగుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాకపోకలు సాగకుండా కందనెల్లి, మన్‌సాన్‌పల్లి వాగుల వద్ద రోడ్డుకు అడ్డంగా గుంతలు తవ్వేశారు. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కందనెల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. పొలాలకు వెళ్లిన రైతులు, కూలీలు వర్షాన్ని గమనించి ఇళ్లకు చేరుకున్నారు. గాజీపూరు, బుద్దారం వాగులు పొంగి ప్రవహించాయి.

దేవనూర్‌ రోడ్డుపై పారుతున్న వరద

నీటమునిగిన పొలాలు


చెంగోల్‌ శివారులో..

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: తాండూరు మండల వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. కరణ్‌కోట, గౌతాపూర్‌, చెంగోల్‌, అల్లాపూర్‌, గోనూరు, నారాయణ్‌పూర్‌, ఎల్మకన్నె, చెంగెష్‌పూర్‌, అంతారం, మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, సిరిగిరిపేట, వీరారెడ్డిపల్లి, రాంపూర్‌, పర్వతాపూర్‌, బెల్కటూరు, చిట్టిగణాపూర్‌లో వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. ఉదయం నుంచి మబ్బులు కమ్ముకొని వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు పనులు మానుకోవాల్సి వచ్చింది. భారీ వర్షం కురవడంతో చెంగోల్‌లో బాహ్యవలయ రహదారికి రెండు వైపులా వరి పొలాలు నీట మునిగాయి. పెట్టుబడులు నష్టపోవడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాపూర్‌, కోటబాస్పల్లి, ఓగీపూర్‌ గనుల్లోకి వరద చేరడంతో పదులసంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయారు.


వాగు దాటొద్దు


గొట్టిముక్కల వాగును పరిశీలిస్తున్న తహసీల్దార్‌ కృష్ణయ్య

వికారాబాద్‌ గ్రామీణ: భారీ వర్షాలు కురుస్తున్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ కృష్ణయ్య అన్నారు. సోమవారం రాత్రి గొట్టిముక్కల వాగు ప్రవహించడంతో ప్రజలు దాటకుండా అరగంటపాటు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. పాత ఇళ్లు, రేకుట షెడ్లు, గుడిసెల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సర్పంచులతో చాటింపు వేయించారు. వాగుల వద్ద గ్రామస్థులు కాపలా ఉండాలని సూచించారు.


అప్రమత్తంగా ఉండాలి


పరిగి సమీపాన వాగును పరిశీలిస్తున్న అదనపు పాలనాధికారి మోతీలాల్‌, ఆర్డీఓ

పరిగి,న్యూస్‌టుడే: ప్రజలకు అందుబాటులో ఉండి. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి మోతీలాల్‌ అన్నారు. సోమవారం రాత్రి వికారాబాద్‌ ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డితో కలిసి పరిగికి వచ్చారు. అనంతరం పరిగి సమీపాన వాగును పరిశీలించారు. వరద ప్రవాహం పెరుగుతున్న కారణంగా పరిగి - జిల్లా కేంద్రం మధ్య రాకపోకలు నిలిపి వేయాలని తహసీల్దారు విద్యాసాగర్‌రెడ్డిని ఆదేశించారు. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం దోమ, కుల్కచర్ల మండలాల్లో పర్యటించారు.


అత్యవసరమైతేనే బయటకు రండి: మోతీలాల్‌, అదనపు కలెక్టర్‌

భారీ వర్షాలకు ముందస్తుగానే సమాయత్తమయ్యాం. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేశాం. గ్రామం, మండలం, జిల్లా అన్ని స్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. భారీ వర్షాలకు వరదలు వచ్చే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాల, పురాతన ఇళ్లలో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించాం. పాఠశాలలు, పంచాయతీ భవనాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి నష్టము సంభవించలేదు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్ధు.


మండలం     వర్షపాతం (సెంటీ మీటర్లలో)

వికారాబాద్‌ 6.4

యాలాల 5.6

కుల్కచర్ల 3.9

పెద్దేముల్‌ 3.4

కోట్‌పల్లి 3.3

పరిగి 3.2

ధారూర్‌ 3.1

మర్పల్లి 3

మోమిన్‌పేట్‌ 2


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని