సురక్షితం సరే.. గమ్యం మరిచారే!
eenadu telugu news
Published : 28/09/2021 04:03 IST

సురక్షితం సరే.. గమ్యం మరిచారే!

అర్ధాంతరంగా బస్సు ట్రిప్పులు రద్దు చేసిన ఆర్టీసీ

నడిరోడ్డుపై వర్షంలో ప్రయాణికులు అవస్థలు

ఈనాడు, హైదరాబాద్‌: జోరుగా వర్షం.. ఆర్టీసీ సిటీ బస్సులు ప్రయాణికులను నడిరోడ్డుపై దించేశాయి. మధ్యలో ఆపేసి ట్రిప్పులు రద్దు చేయడంతో సోమవారం సాయంత్రం నడి రోడ్డుపై తడిచి ముద్దయ్యారు. సోమవారం సాయంత్రం 7 గంటల తర్వాత దాదాపు 30 శాతం బస్సులు రద్దవ్వగా.. 8.30 గంటలకు 50 శాతం బస్సులను ఆర్టీసీ అనధికారికంగా రద్దు చేసింది. ఇక రాత్రి 9 దాటిన తర్వాత బస్సులే కరవయ్యాయని నగర ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.

వరదలో చిక్కుకుంటున్నాయని.. ఎప్పుడు ఎక్కడ వరద వస్తుందో తెలియని పరిస్థితి నగరంలో ఉంది. వెళ్లేటప్పుడు బాగున్నా.. వచ్చేటప్పుడు వరదలో చిక్కుకుంటున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు కూడా అంతంతమాత్రం ఉండడంతో బస్సులను అర్ధాంతరంగా రద్దు చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్‌జీవోస్‌ కాలనీకి తీసుకెళ్లే హయత్‌నగర్‌ డిపో బస్సులు ప్రయాణికులను మధ్యలోనే దించేసినట్లు పలువురు ఉద్యోగులు వాపోయారు. ఇదే పరిస్థితి నగరంలో పలు చోట్ల ఎదురయ్యింది. నగర శివారు డిపోలకు చెందిన బస్సులు సాయంత్రం 7 గంటలకే చివరి ట్రిప్పుల మాదిరి డిపోలకు చేరాయి.

ఆగిపోతాయని.. ముందుగానే.. ఆర్టీసీ సిటీ బస్సుల సేవలకు సంబంధించి రేతిఫైల్‌, కోఠిలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోను చేస్తే.. భారీ వర్షాలు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆర్టీసీ బస్సుల ట్రిప్పులను అర్ధాంతరంగా రద్దు చేసినట్టు చెప్పారు. మలక్‌పేట మార్కెట్‌ దగ్గర, చాదర్‌ఘాట్‌ వంతెన తదితర ప్రాంతాల్లో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే.. ఇబ్బందులు తలెత్తుతాయని ముందుగానే బస్సు సర్వీసులను 30 శాతం వరకూ సాయంత్రానికి రద్దు చేసినట్టు చెప్పారు. దీంతో సాయంత్రం 6 తర్వాత బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వర్షాలు ఇలాగే కొనసాగితే మంగళవారం కూడా 20 శాతం బస్సులు డిపోలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని