నోటి కాడి కూడు నీటి పాలు!
eenadu telugu news
Published : 28/09/2021 04:03 IST

నోటి కాడి కూడు నీటి పాలు!

ఇళ్లలోకి వరద.. బియ్యం, నిత్యావసరాలు, సామాన్లన్నీ నాశనం

బిక్కుబిక్కుమంటూ మురుగు నీటిలోనే జనం జాగారం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, ఆర్‌కేపురం, న్యూస్‌టుడే

 


హరిపురం కాలనీలో ఇంట్లోకి నీరు

గులాబ్‌ తుపానే కాదు.. చిన్న చినుకు పడినా నగరవాసుల్లో గుబులు మొదలువుతోంది. చిన్నపాటి వానకే చిత్తడయ్యే రోడ్లు, ఇళ్లలోకి చేరే నీళ్లు.. తెప్పిస్తున్న కన్నీళ్లు అలాంటివి. కొన్ని కాలనీల్లో వరదతో పాటు డ్రైన్లు పొంగి ఇంట్లోకి చేరుతోన్న మురుగు నీటితో రోజుల పాటు తిండీ, నిద్ర లేకుండా జాగారం చేస్తున్నారు. బియ్యం, నిత్యావసరాలు, ఇంట్లో వస్తువులన్నీ నీట మునిగి పాడవుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్యలకు పరిష్కారం లేక ఏటా వానలకు ఈ జాగారం పరిపాటిగా మారుతోంది కొన్ని కాలనీల జనానికి.

ఇండ్లు కంపు కొడుతున్నాయ్‌..

కూకట్‌పల్లి నుంచి వచ్చే రసాయన నాలాతో బేగంపేట పరిధిలోని అల్లంతోట బావి, మయూరీ మార్గ్‌లో దాదాపు 500 కుటుంబాలకు ఏటా తిప్పలే. ఇక్కడ డ్రైనేజీ కూడా పొంగడంతో ఇళ్లలో మురుగు నీరు చేరి కంపు కొడుతోంది. సరూర్‌నగర్‌, ఆర్‌కేపురం పరిధిలో పొంగిన డ్రైనేజీతో హరిపురి కాలనీ, రోడ్‌ నెంబర్‌ 12ల్లో నివాసితులకు నరకం తప్పలేదు. మల్కాజ్‌గిరి పరిధిలో షిర్డీ నగర్‌, అంబేడ్కర్‌నగర్‌, యూసుఫ్‌గూడ శ్రీకృష్ణనగర్‌ల్లో ఇళ్లు, కిరాణా దుకాణాల్లోకి వరద చేరింది. బోడుప్పల్‌ రామ్‌రెడ్డి నగర్‌, జీడిమెట్ల కొంపల్లి ఉమామహేశ్వర కాలనీల్లోనూ ఇదే దుస్థితి. పాతబస్తీలో చాలా ప్రాంతాల్లో నివాసితులకు కంటిమీద కునుకు కరవైంది.

ఇంకెన్నేళ్లు ఈ కష్టాలు: సత్యవతి, అల్లంతోట బావి

ఏటా వానలొస్తే మురుగు నీరు ఇళ్లలో చేరుతోంది. ఎన్నిసార్లు చెప్పినా స్పందిచరు.. శాశ్వత పరిష్కారం చూపించరు. రాత్రి నుంచి కంటి మీద కునుకు లేదు.

రూ.4లక్షలు నీళ్లపాలు..: గోపి, కిరాణ వర్తకుడు, బేగంపేట

గతేడాది ఇదే సమయానికి రాత్రికి రాత్రి వానొచ్చి దుకాణం నీట మునిగింది. రూ.4లక్షల విలువైన సామాన్లన్నీ నాశనమైపోయాయి. రాత్రి నుంచి వానకు మళ్లీ అదే పరిస్థితి ఏర్పడుతోంది.

వర్షమొస్తే భయం..: సంద్య, మణి, మయూరీ మార్గ్‌ నివాసితులు

వర్షమొస్తే మా ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. కింది ఫ్లోర్‌లో ఉండేవాళ్లకు నరకం తప్పదు. మొత్తం నీరు నిండి తినేందుకు తిండి, నిద్ర ఉండవు. జాగారమే.

ఎన్ని ఫిర్యాదులు చేశానో..!: నాగేశ్వరరావు, హరిపురి కాలనీ

మా ప్రాంతంలో డ్రైనేజీ సమస్య ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు మురుగు నీరంతా ఇంట్లోకి చేరింది. రెండు రోజులుగా చిన్న పిల్లలతో ఇంట్లో నరకం అనుభవిస్తున్నాము.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని