ఆటో, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడి దుర్మరణం
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

ఆటో, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడి దుర్మరణం

మరొకరి పరిస్థితి విషమం

శివ్వంపేట, న్యూస్‌టుడే: ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేట పరిధిలోని రాజన్న వాగు వంతెనపై చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రవికాంత్‌రావు తెలిపిన వివరాలు.. శివ్వంపేటకు చెందిన సోమసాని పాండరి, లక్ష్మీనర్సమ్మ దంపతులకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. కుమారులు లక్ష్మణ్‌, నవీన్‌లు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం లక్ష్మణ్‌ (22), తన మిత్రుడైన అనిల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై దొంతి గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా నర్సాపూర్‌ నుంచి తూప్రాన్‌ వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వెళ్తున్న ఆటో రాజన్న వాగు వంతెనపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. లక్ష్మణ్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రుడిని నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. మృతుడి కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి రోదించారు. మృతుడి తండ్రి పాండరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని