తాగునీటికి.. జాతీయ రహదారిపై ఆందోళన
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

తాగునీటికి.. జాతీయ రహదారిపై ఆందోళన

బైఠాయించిన తండావాసులు

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా పరిగి మండల పరిధిలోని సాలిప్పలబాట తండా వాసులు మంగళవారం బీజాపూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఖాళీబిందెలతో ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించడంతో రెండు వైపులా వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోయి గంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే దారిన వెళ్తున్న కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పరిగి సీఐ లక్ష్మిరెడ్డి అక్కడికి చేరుకుని తండావాసుల ఆందోళనను విరమింపజేసి వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పించారు. నిరసనకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా తాగునీటి ఎద్దడి ఏర్పడి ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయం సర్పంచి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించు కోవడం లేదని వారు ఆరోపించారు. గ్రామంలో లీకేజీలున్నా మరమ్మతులకు నోచుకోవడంలేదని వాపోయారు. సర్పంచి సాలీబాయి వివరణ ఇస్తూ.. ప్రతి రోజు మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతున్నా తండా వాసులు వాడటం లేదన్నారు. నియంత్రిక దగ్గర విద్యుత్తు సమస్యతో రెండు రోజులు బోరు పనిచేయలేదని.. మంగళవారం సాయంత్రానికి సమస్యను పరిష్కరించామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని