ఎన్‌కౌంటర్‌పై స్కెచ్‌ ఎందుకు గీయలేదు?
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

ఎన్‌కౌంటర్‌పై స్కెచ్‌ ఎందుకు గీయలేదు?

ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులపై సిర్పుర్కర్‌ కమిషన్‌ అసహనం

ఈనాడు, హైదరాబాద్‌ : ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఘటనాస్థలిలోనే చిత్తు ప్రతి (రఫ్‌ స్కెచ్‌)ని ఎందుకు గీయలేకపోయారని జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ప్రతినిధులను జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ప్రశ్నించింది. విచారణకు మంగళవారం ఎన్‌హెచ్‌ఆర్‌సీ డీఐజీ మంజిల్‌సైనీ, ఇన్‌స్పెక్టర్లు దీపక్‌కుమార్‌, అరుణ్‌త్యాగి హాజరయ్యారు. ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు పోలీసులు ఎక్కడ ఉన్నారు..? నిందితులు ఎంత దూరంలో ఉన్నారు..? కాల్పులు ఎందుకు జరిగాయి..? లాంటి అంశాలకు సంబంధించి ఘటనాస్థలిలోనే ఎందుకు స్కెచ్‌ గీయలేదని అడిగింది. దీనికి తాము ఆ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో మీడియాతోపాటు స్థానికులు పెద్దఎత్తున గుమిగూడారని.. ఒక దశలో తోపులాట జరిగే అవకాశముండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు బదులిచ్చారు. తర్వాత ఎన్‌కౌంటర్‌ ఉదంతంలో పాల్గొన్న పోలీసుల నుంచి ఘటనకు సంబంధించి సమాచారం సేకరించి రఫ్‌ స్కెచ్‌ గీశామని చెప్పారు. అనంతరం మళ్లీ పోలీసులతో విడివిడిగా మాట్లాడి నిర్ధారించుకున్నామని వివరించారు. ఈ వివరణపై కమిషన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఘటనాస్థలిలో ఫొటోలు, వీడియోలు తీయకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఒకరైన జొల్లు శివ చదివిన పాఠశాల జారీ చేసిన బోనఫైడ్‌ సర్టిఫికేట్‌లో, అతడి ఆధార్‌కార్డులో వయసులో తేడా గురించి నివేదికలో ఎందుకు తెలపలేదని ప్రశ్నించింది. వయసులో తేడా గురించి స్పష్టత వచ్చేందుకు ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని హక్కుల కమిషన్‌ ప్రతినిధులు చెప్పారు.
పోలీసులు కోలుకున్నా వాంగ్మూలాలేవీ..?
ఎన్‌కౌంటర్‌లో గాయపడినట్లుగా చెబుతున్న ఇద్దరు పోలీసు సిబ్బంది గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా వారి వాంగ్మూలాలు ఎందుకు నమోదు చేయలేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులను జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ప్రశ్నించింది. మానవ హక్కుల కమిషన్‌ ప్రతినిధుల విచారణ బుధవారమూ కొనసాగనుంది. అలాగే చటాన్‌పల్లికి నిందితులను తరలించిన వాహనాల డ్రైవర్లతోపాటు మృతులకు శవపరీక్ష నిర్వహించిన వైద్యులు, పోలీస్‌ క్షతగాత్రులకు వైద్యం అందించిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులను కమిషన్‌ విచారించనుంది. ఈ క్రమంలో బుధవారం జరుగుతుందని భావించిన సైబరాబాద్‌ అప్పటి కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ విచారణ వాయిదా పడే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని