స్త్రీ ప్రగతికి పెన్నిధి
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

స్త్రీ ప్రగతికి పెన్నిధి

లక్ష్యంమేర రుణాల అందజేత

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(డీఆర్‌డీఏ) స్త్రీనిధి రుణాలు అందిస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా అడిగిన గంటల వ్యవధిలో రుణాలు అందించి ప్రోత్సహిస్తోంది. రుణాలను పెట్టుబడులుగా సద్వినియోగం చేసుకుంటున్న స్వయం సహాయక సంఘా మహిళలు ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. జిల్లాలో స్త్రీనిధి రుణాల పంపిణీ పురోగతిపై ‘న్యూస్‌టుడే’ కథనం...

జిల్లా జనాభా 9.79 లక్షలు వీరిలో మహిళలు అధికంగా ఉన్నారు. వారి ఆర్థిక అభ్యున్నతికి డీఆర్‌డీఏ అధికారులు ఏటా రూ.కోట్లల్లో రుణాలు పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా, మున్సిపాలిటీల్లో మెప్మా ద్వారా వీటిని అందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటివరకు 52శాతం పూర్తైంది. అత్యధికంగా తాండూరు మండలం రూ.5.89 కోట్ల పంపిణీతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా రూ.1.19 కోట్లతో ధారూరు మండలం ఆఖరి స్థానంలో ఉంది. మహిళల ఆసక్తికి అనుగుణంగా స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు అధికారులు అవగాహన కల్పిస్తూ, రుణాలు పొందేందుకు సూచిస్తున్నారు. స్వయం ఉపాధి, కుటీర పరిశ్రమ, వ్యాపారాల వంటి యూనిట్ల పెట్టుబడికి స్త్రీనిధి పథకం ద్వారా ఆర్థిక సహకారం అందజేస్తున్నారు. వడ్డీ 11.5 శాతం విధిస్తున్నారు. గతంలో రూ.1.05 వడ్డీ ఉండగా, తగ్గింపుతో 95 పైసలకు చేరింది. రూ.వేలు, రూ.లక్షల్లో రుణాలు పొందుతున్న వారికి నెలనెలా చెల్లించే వడ్డీ భారం తగ్గడంతో ఆర్థిక ఉపశమనం పొందుతున్నారు.

ఆన్‌లైన్‌లో సత్వరమే..

పొదుపు సంఘాల్లోని సంఘం సభ్యులు, కార్యవర్గంతో పనిలేకుండా మహిళలకు నేరుగా రుణం మంజూరు చేస్తున్నారు. ఎలాంటి తీర్మానం, షరతులు విధించకుండా రూ.30వేలు అడిగిన ఇరవైనాలుగు గంటల్లో అందిస్తున్నారు. మహిళల రుణాలు, పొదుపు, నిర్వహించే ఉపాధి యూనిట్లకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. బ్యాంకులు, మహిళా సమాఖ్య కార్యాలయాలకు తిరిగే పనిలేకుండా ట్యాబ్‌లు, పీసీలలో వివరాలు పరిశీలించి వెంటనే అందించేందుకు మార్గం సుగమమైంది. నగదు అత్యవసరమైన మహిళలకు ఈ రుణం అండగా నిలుస్తోంది. ఈ రుణం పొందిన మహిళ అకాల మరణం చెందితే తీసుకున్న రుణం మాఫీ అవుతుంది. అప్పటివరకు చెల్లించిన రుణ వాయిదాల సొమ్మును సైతం తిరిగి కుటుంబసభ్యులకు చెల్లించనున్నారు. అంత్యక్రియల నిమిత్తం అప్పటికప్పుడు రూ.5వేల సాయం అందిస్తున్నారు. రుణం పొందిన మహిళ పేరిట అధికారులు బీమా చేయించడం వల్ల కుటుంబసభ్యులపై రుణభారం పడకుండా ఊరట లభిస్తోంది.


100కుపైగా ఉపాధి యూనిట్లకు

పొదుపు సంఘాల్లో మహిళలు 100 రకాల వ్యాపార, ఆదాయ, అభివృద్ధి కార్యకలాపాలకు స్త్రీనిధి రుణాలు పొందవచ్ఛు దర్జీ, కిరాణ, దుస్తులు విక్రయ దుకాణాలు, హోటళ్లు, బ్యూటీపార్లర్‌, అలంకార సామగ్రి విక్రయ కేంద్రం, పప్పు మిల్లు, అంతర్జాల కేంద్రం, విస్తరాకుల తయారీ వంటి కుటీర పరిశ్రమలకు, విద్యార్థుల సౌకర్యార్థం సైకిల్‌, ల్యాప్‌టాప్‌ కొనుగోళ్లకు, పాడిపశువుల కొనుగోలుకు, గౌరవగృహాల నిర్మాణానికి రుణాలు అందిస్తున్నారు. వ్యవసాయం చేసే మహిళలు పెట్టుబడుల నిమిత్తం రుణాలు పొందే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం రబీ సీజన్‌ ప్రారంభమైనందున ఎరువులు, విత్తనాల కొనుగోలు, కూలీలకు చెల్లింపులకు, పరికరాల కొనుగోలుకు అవసరమైన పెట్టుబడులకు స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవచ్ఛు రుణాలు తీసుకున్న మహిళలు నెలనెలా చెల్లించే వాయిదాల సొమ్ములో అవకతవకలకు పాల్పడకుండా ఎప్పటికప్పుడు కార్డుల్లో నమోదు చేస్తున్నారు. అందుకు రుణం పొందిన ఒక్కో మహిళకు ప్రత్యేకంగా కార్డులను అందజేసి నమోదు చేయడంతో పారదర్శకత నెలకొంది.


ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం

- తుమ్మల వేణు, జిల్లా ప్రాంతీయ మేనేజరు, స్త్రీనిధి

డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా తక్కువ వ్యవధిలో స్త్రీనిధి పథకం రుణాలు మంజూరు చేస్తున్నాం. రుణాలతో ఏర్పాటు చేస్తున్న వ్యాపారాలు, ఉపాధి యూనిట్లను సక్రమంగా నిర్వహించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అవగాహన కల్పిస్తున్నాం. సద్వినియోగం చేసుకుంటూ ఆదాయం ఆర్జిస్తున్నారు. నెలనెలా రుణ వాయిదాలు కడుతూ ఆర్థిక పురోగతిలో పయనిస్తున్నారు.

జిల్లాలో

గ్రామ సమాఖ్యలు: 647

స్వయం సహాయక సంఘాలు: 14,239

నమోదైన మహిళలు: 1.46 లక్షలు

స్త్రీ నిధి రుణాల లక్ష్యం: రూ.79.92 కోట్లు

పంపిణీ చేసింది: రూ.41.56 కోట్లు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని