బయో అంకురాలు!
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

బయో అంకురాలు!

ఈనాడు, హైదరాబాద్‌

కొవిడ్‌ భయాలు తగ్గినా.. వ్యాప్తి ముప్పు ఇంకా తొలగలేదు. ఏసీ గదుల్లో సమావేశం కావాలంటే ఇప్పటికీ వణుకే. అందుకే గదిలోని గాలిని, అందులోని వైరస్‌ను శుభ్రం చేసే పరికరం అభివృద్ధి చేసింది ఒక అంకుర సంస్థ. కరోనా వచ్చి తగ్గినవారిలో హఠాత్తుగా గుండె సమస్యలతో కుప్పకూలిపోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు గుండె పనితీరును మొబైల్‌కు చేరవేసే యాప్‌ను అభివృద్ధి చేసింది మరో సంస్థ. ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలకు సీసీఎంబీలోని అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం (ఏఐసీ) వేదికైంది. కొవిడ్‌-19 టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ (కొవిడ్‌ టెడ్‌) యాక్సిలరేషన్‌ కార్యక్రమం కింద అంకుర సంస్థలను ప్రోత్సహిస్తోంది.

గుండె చిప్‌

గుండె చప్పుడు తెలుసుకునేలా..

కొవిడ్‌ తర్వాత కొందరిలో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మధ్య వయస్కులు గుండె సంబంధిత సమస్యలతో చాలామంది కుప్పకూలిపోతున్నారు. సమయానికి ఆసుపత్రికి తీసుకెళితే సరి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం. చిన్న చిప్‌ను అమర్చడం ద్వారా ఎప్పటికప్పుడు మన గుండె పనితీరును తెలుసుకోవచ్చు అంటోంది కేరళకు చెందిన టెక్నో సొల్యూషన్స్‌ అంకుర సంస్థ. ‘వఫె్‌ చిప్స్‌’ పేరుతో ఒక చిన్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఐవోటీ ఆధారంగా పనిచేస్తుంది. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులుంటే అప్రమత్తం చేస్తుంది. ఈ పరికరం త్వరలో మార్కెట్లోకి రానుంది.

గాల్లోని వైరస్‌ను నాశనం చేస్తుంది..

కొవిడ్‌ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందని ఇండోర్‌ ప్రదేశాల్లో ఎక్కువ మంది ఒకచోట చేరొద్దని హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా గాలి లోపలికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. లోపలికి వచ్చిన గాలిలో వైరస్‌ ఉంటే నాశనం చేసే ‘స్టెర్ల్‌ ఎయిర్‌’ పరికరాన్ని స్టెర్ల్‌ బయోసిస్టమ్స్‌ అంకుర సంస్థ అభివృద్ధి చేసింది. ఐసీయూలో సెకండరీ ఇన్ఫెక్షన్స్‌ తగ్గించడానికి దోహదం చేస్తుంది. పరీక్షించి చూడగా 99.9 శాతం వైరస్‌ను నాశనం చేస్తున్నట్లు తేలింది. మరో అంకుర సంస్థ ‘స్వచ్ఛ్‌ ఎయిర్‌ ప్లగ్‌ అండ్‌ ప్లే’ పరికరాన్ని అభివృద్ధి చేసింది. గదిలోని వైరస్‌లను చంపేసి స్టెరిలైజ్‌ చేస్తుంది.

కృత్రిమ మేథతో ఎక్స్‌రేను విశ్లేషించి..

కొవిడ్‌ వ్యాప్తిని నిరోధించాలంటే వేగంగా, కచ్చితత్వంతో చేసే నిర్ధారణ పరీక్షలు పెరగాలి. చెస్ట్‌ ఎక్స్‌రే ద్వారా కూడా నిర్ధారించొచ్చు అని గతంలో తేల్చారు. వైద్యులు ఎక్స్‌రేను పరిశీలించి విశ్లేషించేందుకు, నిర్ధారణకు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. దిల్లీకి చెందిన అంకుర సంస్థ కృత్రిమ మేథ, మెషన్‌ లెర్నింగ్‌ ఉపయోగించే వెంటనే గుర్తించే కొవినెట్‌ను అభివృద్ధి చేసింది. ఈ మోడల్‌లో 98.62 శాతం కచ్చితత్వం వచ్చిందని ఐఐటీ దిల్లీ పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతమిది ధ్రువీకరణ దశలో ఉంది.


అన్ని దశల్లో తోడ్పాటు అందించేలా..

- డాక్టర్‌ మధుసూదన్‌రావు, సీఈవో, ఏఐసీ-సీసీఎంబీ

యో రంగంలో చాలాకాలం శ్రమిస్తే తప్ప ఒక ఆలోచన ఉత్పత్తి దశకు చేరలేదు. ఇందులోని క్లిష్టతలను గుర్తించే అత్యుత్తమమైన రెండు సంస్థలకు ఆర్థిక సహాయం చేసేందుకు కొవిడ్‌ టెడ్‌ చేపట్టాం. 34 దరఖాస్తులు రాగా వడపోత అనంతరం 13 ఎంపికయ్యాయి. ఈ రంగంలో నిపుణులైన కమిటీ అన్నింటిని పరిగణనలోని తీసుకుని ఆరింటిని తుది దశకు ఎంపిక చేశారు. వీటిలోంచి రెండింటిని ఎంపిక చేసి నిధుల సాయం చేయనున్నాం. సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ రూ.2.3 కోట్ల నిధులను అందించేందుకు ముందుకొచ్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని