సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Updated : 18/10/2021 04:00 IST

సంక్షిప్త వార్తలు

బ్రాహ్మణ మహిళల స్వయం ఉపాధికి కార్యశాల

కాచిగూడ, న్యూస్‌టుడే: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బ్రాహ్మణ మహిళల స్వయం ఉపాధికి కార్యశాల నిర్వహించనున్నట్లు భారత బ్రాహ్మణ సంస్థాన్‌, బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్‌శర్మ తెలిపారు. ఆదివారం కాచిగూడలోని బ్రాహ్మణ సంక్షేమ భవన్‌లో ఆయన మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు ఫోన్‌ నంబరు: 9059419147 సంప్రదించాలి.


రామానుజుల విగ్రహావిష్కరణలో అందరూ భాగస్వాములు కావాలి

సైదాబాద్‌, న్యూస్‌టుడే: ముచ్చింతల్‌లోని త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో ఫిబ్రవరిలో జరిగే రామానుజుల విగ్రహావిష్కరణకు అందరూ భాగస్వాములు కావాలని త్రిదండి రామానుజ దేవనాథ జీయర్‌స్వామి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2-14 వరకు కొనసాగే కార్యక్రమాల్లో భాగంగా విగ్రహం చుట్ట్టూ నిర్మించిన 108 ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ జరగనుందని వివరించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేవనాథ జీయర్‌స్వామి సైదాబాద్‌ ఎస్బీహెచ్‌-బీ కాలనీలోని కోదండ రామాలయంలో భక్తులనుద్దేశిస్తూ ప్రసంగించారు. తొలుత ఎస్బీహెచ్‌-సీ కాలనీ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ రావికంటి శ్రీనివాస్‌ పూలదండను ఆయనకు సమర్పించారు. కార్యక్రమంలో కోదండ రామాలయం కమిటీ ప్రతినిధులు, ఎస్బీహెచ్‌ పంచ కాలనీల ప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.


కుటుంబ కలహాలతో హత్య

మియాపూర్‌, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వరంగల్‌ జిల్లా ఐనోల్‌ మండలం కొండపర్తి గ్రామానికి చెందిన క్రాంతిరెడ్డి(30)కి మియాపూర్‌ ఎంఎనగర్‌కు చెందిన దుర్గతో 2015లో వివాహమైంది. వీరు లింగంపల్లిలో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసుకునే అతనికి భార్యతో కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. తరుచూ గొడవలు జరుగుతుండటంతో అత్తమామలు సర్దిచెప్పారు. శనివారం రాత్రి మాట్లాడదామని చెప్పడంతో క్రాంతిరెడ్డి, దుర్గ ఎంఎనగర్‌లోని అత్తమామల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో తలెత్తిన గొడవలో క్రాంతిరెడ్డిపై బావమరిది అప్పన్న, అత్త నాగర్నతం దాడికి పాల్పడ్డారు. రాయితో తలపై మోదగా మృతిచెందాడు. అత్తమామతోపాటు బావమరిది పరారయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ వెంకటేష్‌ తెలిపారు.


ఛాంప్స్‌ స్తుతి, అనిరుధ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కిడ్స్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో స్తుతి, అనిరుధ్‌ సత్తాచాటారు. ఆదివారం మణికొండలోని ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-15 బాలికల సింగిల్స్‌లో స్తుతి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఆమె 10-15, 15-10, 15-12 తేడాతో ఆరుషిపై విజయం సాధించింది. బాలుర సింగిల్స్‌ ఫైనల్లో అనిరుధ్‌ 21-14, 21-17తో మనిత్‌పై గెలిచి ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. రాచకొండ నేర విభాగం ఏసీపీ ఎస్‌ఎన్‌ జావేద్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని