పండగ వేళ.. ఆర్టీసీ ఆదాయం భళా!
eenadu telugu news
Updated : 20/10/2021 00:58 IST

పండగ వేళ.. ఆర్టీసీ ఆదాయం భళా!

ఆదాయం ఎక్కువగా తీసుకొచ్చిన ఉద్యోగులకు మిఠాయి తినిపిస్తూ..

బస్సు ప్రయాణమే సురక్షితం. ఇది ప్రయాణికులకు ఆర్టీసీపై ఉన్న నమ్మకం మరోసారి చేతల్లోనూ నిరూపితమైంది. కరోనా కారణంగా ప్రజలు కొంతకాలం ప్రయాణాలకు దూరంగా ఉండిపోయారు. ఇటీవల మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో ప్రయాణాలపై ఆసక్తి పెరిగింది. దీనికితోడు దసరా పండగకు సొంతూర్లకు వెళ్లడం, తిరిగి వచ్చేందుకు అత్యధికులు ఆర్టీసీ బస్సులనే నమ్ముకున్నారు. దీంతో సంస్థ ఆదాయం ఒక్కసారిగా పెరగడం విశేషం. మెదక్‌ రీజియన్‌ పరిధిలోని అన్ని డిపోల్లో కలిపి సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం రూ.కోటి దాటడం గమనార్హం.

- న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, మెదక్‌ అర్బన్‌, సిద్దిపేట టౌన్‌

మెదక్‌ రీజియన్‌ పరిధిలో సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాలోని డిపోల్లో కలిపి 676 బస్సులు ఉన్నాయి. సంగారెడ్డి డిపో పరిధిలో అత్యధికంగా 117 బస్సులు ఉండగా అత్యల్పంగా దుబ్బాక డిపోలో ఉన్నవి 33 మాత్రమే. పండగ సమయం కావడంతో అన్ని ప్రధాన మార్గాల్లో బస్సులు నడిపించారు.

రికార్డు స్థాయిలో..

రీజియన్‌ పరిధిలో ఆర్టీసీ ఆదాయం నిత్యం సగటున రూ.69.11 లక్షలు. పండగ సమయం కావడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. సంస్థకు ఆదాయం కూడా అదే స్థాయిలో సమకూరుతోంది. సోమవారం ఏకంగా రికార్డు స్థాయిలో రూ.1.06 కోట్లు రావడం విశేషం. ఆదాయంలో సంగారెడ్డి డిపో మొదటి స్థానంలో ఉంది. రూ.20.09 లక్షల మేర చేకూరింది. జహీరాబాద్‌, మెదక్‌, సిద్దిపేట డిపోల్లోనూ ఆదాయం రూ.17 లక్షలు దాటింది.

ప్రయాణికుల సంఖ్య పెంపుపై..

లక్ష్యాన్ని మించి ఆదాయం తీసుకొచ్చిన వారి జాబితా ఆధారంగా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో కండక్టర్లు సైతం రద్దీ ఉండే చోట్ల బస్సును కొద్దిసేపు ఆపి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించేందుకు యత్నిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. సర్వీసు ఎక్కడికి వెళ్తుంది, ఎంత సమయంలో బయలుదేరుతుందన్న సమాచారాన్ని ప్రయాణికులకు వినిపించేలా చెబుతున్నారు. సగటున ఒక బస్సులో వెళ్లే వారి సంఖ్య (ఆక్యుపెన్సీ రేషియో) ప్రస్తుతం 65 శాతం ఉండగా సోమవారం అది 83 శాతంగా నమోదైంది.

కొవిడ్‌ నిబంధనలు..

ఆర్టీసీ డిపోల్లో, బస్సు సర్వీసుల్లో కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. బస్సును నిత్యం శానిటైజేషన్‌ చేయించడంతో పాటు శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రయాణ ప్రాంగణాలు, డిపో కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నారు.

అందరి కృషితో..: రాజశేఖర్‌, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్‌

ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు సంస్థ ఆదాయం పెంపునకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అధికారులు, ఉద్యోగులు సమష్టిగా ముందుకు సాగుతుండటంతో సత్ఫలితాలు వస్తున్నాయి. ఆదాయ మార్గాలను అన్వేషించడంతో పాటు నష్టాలు తగ్గించేందుకు యత్నిస్తున్నాం. దసరా పండగ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా సర్వీసులను నడపంతో మంచి ఆదాయం వచ్చింది.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో డిపోలు: 08

బస్సులు: 676

నిత్యం తిరిగే కి.మీ.: 1.50 లక్షలు

రోజూ ప్రయాణించే వారు: 1.40 లక్షలు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని