డా.చిగురుపాటి జయరాం హత్య కేసు.. జైలు లోపలే నిందితుడి బెదిరింపు లేఖలు
eenadu telugu news
Updated : 21/10/2021 08:43 IST

డా.చిగురుపాటి జయరాం హత్య కేసు.. జైలు లోపలే నిందితుడి బెదిరింపు లేఖలు

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌, చంచల్‌గూడ: ప్రవాస భారతీయుడు, వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులోంచి బయటపడేందుకు ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదులతో పాటు సాక్షులను బెదిరించేందుకు రాకేష్‌రెడ్డి పక్కా ప్రణాళికను రూపొందించాడు. అమలు బాధ్యతను తన స్నేహితుడు, స్థిరాస్తి వ్యాపారి మంగయ్యగుప్తాకు అప్పగించాడు. నాంపల్లి కోర్టులో 2 నెలల క్రితం కేసు విచారణ ప్రారంభం కాగానే జైల్లో ఉన్న రాకేష్‌రెడ్డి సూచనల మేరకు మంగయ్యగుప్తా, చంచల్‌గూడ జైల్‌ మేల్‌ నర్స్‌ అక్బర్‌లు బెదిరింపు లేఖలను ఇద్దరు పీపీలు, ముగ్గురు సాక్షులకు పంపించారు. భయపడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, సాక్షులు తమకు అనుకూలంగా మారిపోతారని భావించగా... వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం, అంతకుముందు నుంచే జూబ్లీహిల్స్‌ పోలీసులు రాకేష్‌రెడ్డి ములాఖత్‌ల జాబితాపై నిఘా ఉంచడంతో ఈ వ్యవహారం బయటపడింది. మహ్మద్‌ అక్బర్‌, మంగయ్య, శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రూ.5 లక్షలకు బేరం..
జైల్లోని రాకేష్‌రెడ్డిని కలుసుకునేందుకు మంగయ్య గుప్తా వచ్చేవాడు. జైలు సిబ్బందిలో ఎవరైనా సహకరిస్తే కేసు మనవైపు తిరుగుతుందని రాకేష్‌రెడ్డి చెబుతుండేవాడు. ఇందుకు జైల్‌ మేల్‌ నర్స్‌ మహ్మద్‌ అక్బర్‌ అలీని ఎంచుకున్నారు. రూ.5లక్షలు ఇస్తామన్నారు. అక్బర్‌అలీ తరచూ మంగయ్యతో మాట్లాడేవాడు. బెదిరింపు లేఖలను పంపించేందుకు నెలరోజుల క్రితం కత్తుల శ్రీనివాస్‌ ద్వారా ఫోన్‌ కొనిచ్చారు. రాకేష్‌రెడ్డిని అక్బర్‌ తరచూ కలుస్తూ, ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కలుస్తున్నట్లు చెప్పేవాడు. రాసిచ్చిన బెదిరింపు లేఖలను పీపీలకు, సాక్షులకు పంపించాడు. ఈ వ్యవహారంలో రాకేష్‌రెడ్డికి జైల్లో ఇంకా ఎవరైనా ఖైదీలు సహకరించారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు అక్బర్‌ అలీ, మంగయ్య గుప్తా, కత్తుల శ్రీనివాస్‌లకు జూబ్లీహిల్స్‌ పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని