గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ మృతి
eenadu telugu news
Published : 21/10/2021 02:25 IST

గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ మృతి

జ్యోత్స్న

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: విధుల నిర్వహించి ద్విచక్రవాహనంపై ఇంటికెెళ్తూ మౌలాలి రైల్వే పైవంతెనపై గత నెల 12న రోడ్డు ప్రమాదానికి గురైన మహిళా కానిస్టేబుల్‌ జ్యోత్స్న.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. 35 రోజులుగా ఆమెను బతికించేందుకు వైద్యులు యత్నించినా ఫలించలేదు. కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. సీఐ జగదీశ్వరరావు వివరాల ప్రకారం.. బాలాపూర్‌లో నివసించే పిట్టల జ్యోత్న(23) ఆర్నెల్ల క్రితం శిక్షణ పూర్తిచేసుకొని జవహర్‌నగర్‌ ఠాణాలో కానిస్టేబుల్‌గా చేరారు. విధులకు నిత్యం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై వచ్చి వెళ్లేవారు. గత నెల 12న రాత్రి ద్విచక్ర వాహనంపై మౌలాలి జడ్‌టీఎస్‌ నుంచి లాలాపేట సమీపంలోని రైల్వే పైవంతెన మీదుగా తార్నాకకు వెళ్తుండగా.. వెనుకనుంచి దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం జ్యోత్స్నను ఢీకొట్టింది. అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ క్రమంలో వాహనం నుంచి లీకైన పెట్రోల్‌కు అంటుకున్న మంటలు శరీరాన్ని తాకాయి. శరీరం 40 శాతం కాలిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను తొలుత గాంధీ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆమె బుధవారం మృతి చెందారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ ఏసీపీ కె.శివకుమార్‌, జవహర్‌నగర్‌ సీఐ భిక్షపతిరావు తదితరులు జ్యోత్న భౌతిక కాయానికి నివాళులర్పించారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్కాజిగిరి పోలీసులు తెలిపారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని