Cyber Crime: ఆ పరిచయం విలువ రూ.16.72 లక్షలు
eenadu telugu news
Updated : 21/10/2021 06:45 IST

Cyber Crime: ఆ పరిచయం విలువ రూ.16.72 లక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు చెల్లించేందుకు ఓ వ్యక్తి రుణం తీసుకోవాలనుకుని నకిలీ బ్యాంక్‌ అధికారుల చేతుల్లో అడ్డంగా బుక్కయ్యాడు. మొత్తమ్మీద రూ.16.7 లక్షలు మోసపోయాడు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఘట్‌కేసర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాళ్లకు ఎలా చిక్కాడంటే..
ఘట్‌కేసర్‌ పరిధిలో నివాసముండే బాధితుడు(33) ఓ ప్రైవేట్‌ సంస్థ ఉద్యోగి. గతేడాది అక్టోబరులో ఓ మహిళ పేరిట ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వస్తే అంగీకరించాడు. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఓ రోజు వాట్సాప్‌లో వీడియో కాల్‌లో ఇద్దరూ దుస్తులు లేకుండా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ వీడియో బాధితుడి వాట్సాప్‌కు వచ్చింది. డబ్బులివ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరించడంతో రూ.1.4 లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేశాడు. వేధిస్తుండటంతో ఫేస్‌బుక్‌ ఖాతాను డిలీట్‌ చేసి.. ఆ ఫోన్‌ నంబర్‌ను స్విచ్ఛాఫ్‌ చేశాడు.

పైసా బజార్‌.కామ్‌.. ముత్తూట్‌ ఫైనాన్స్‌
ఈ ఏడాది ఫిబ్రవరిలో పాత ఫోన్‌ నంబర్‌ను ఆన్‌ చేశాడు. మళ్లీ పాత వీడియోలు పంపి బెదిరించడంతో మరో రూ.8 లక్షలు బదిలీ చేశాడు. ఇంకా ఒత్తిడి తేవడంతో రూ.11 లక్షలకు ‘పైసాబజార్‌.కామ్‌’లో రుణానికి దరఖాస్తు చేశాడు. ముత్తూట్‌ ఫైనాన్స్‌ నుంచి అంటూ ‘ప్రీతి’ కాల్‌ చేసింది. పలు దఫాలుగా నామినీ, ప్రాసెసింగ్‌ ఛార్జీలు, బీమా, ఐటీ రిటర్న్స్‌, జీఎస్టీ ఛార్జీలు ఇతరత్రా పేరిట రూ.7.32 లక్షలు చెల్లించాడు. నాలుగైదు రోజుల్లో రుణం జమ అవుతుందంటూ చెప్పారు.

ఆర్బీఎల్‌ బ్యాంక్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌..
ఆగస్టు 7న మీ కేవైసీ అప్‌డేట్‌ అయిందంటూ ఆర్బీఎల్‌ బ్యాంక్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. అందులో ఖాతానే లేనప్పుడు మెసేజ్‌ ఎందుకొచ్చిందంటూ ఆరా తీశాడు. రుణం కోసం పంపించిన ధ్రువీకరణ పత్రాలతో నోయిడాలో ఖాతాను తెరిచినట్లుగా గుర్తించాడు. ముత్తూట్‌ ఫైనాన్స్‌లోనూ సంప్రందించగా.. అంతకు ముందు కాల్‌ చేసిన సిబ్బంది ‘నకిలీ’ వ్యక్తులని బయటపడటంతో ఘట్‌కేసర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని