మనస్తాపంతో వృద్ధుడు..
eenadu telugu news
Published : 24/10/2021 00:49 IST

మనస్తాపంతో వృద్ధుడు..

జహీరాబాద్‌ అర్బన్‌, ఝరాసంగం: ఇంటి స్థలం వివాదం పరిష్కారంలో గ్రామ సర్పంచి తనకు అన్యాయం చేశారని మనస్తాపానికి గురైన బాధితుడు పశువుల కొట్టంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జహీరాబాద్‌ గ్రామీణ ఎస్‌ఐ రవిగౌడ్‌ తెలిపిన వివరాలు... ఝరాసంగం మండలం పొట్‌పల్లికి చెందిన నాగన్న (70)కు చెందిన తొమ్మిది గుంటల స్థలం విషయంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తులతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల రచ్చబండ వద్ద గ్రామ సర్పంచి ధన్‌రాజ్‌పటేల్‌ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి వివాదాన్ని చర్చించారు. ఈ స్థలం విషయంలో సర్పంచి సహా మరో ఇద్దరు వ్యక్తులు తనకు అన్యాయం చేశారని బాధితుడు నాగన్న సూసైడ్‌ నోట్‌ జేబులో పెట్టుకుని శుక్రవారం రాత్రి సర్పంచి ఇంటికి ఆనుకుని ఉన్న పశువుల కొట్టం పైపులకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘అన్యాయం చేసిన సర్పంచితోపాటు మరో ఇద్దరిని వదిలి పెట్టోద్దు, పోలీసులు కేసు నమోదు చేయాలని’ ఆ లేఖలో పేర్కొని ఉండటంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్సై ఘటనా స్థలాన్ని సరదర్శించి శవపరీక్షల నిమిత్తం మృతదేహన్ని జహీరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. నాగన్న కుమారుడు మల్లప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


ఆస్తి పంపకంపై మనస్తాపం.. యువకుడు

అల్లాదుర్గం, న్యూస్‌టుడే: ఆస్తి పంపక విషయంలో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ముస్లాపూర్‌ గ్రామానికి చెందిన అనుశమ్మ, మల్లయ్య దంపతులకు ముత్యాలు, శ్రీశైలం ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ముత్యాలు సంగారెడ్డిలో స్థిరపడగా, శ్రీశైలం స్వగ్రామంలోనే ఉంటున్నాడు. వీరికి రెండెకరాలలో 37 గుంటలు ముత్యాలుకు, 43 గుంటలు శ్రీశైలం పేరిట పట్టా చేశారు. ఈ విషయమై ముత్యాలు శుక్రవారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీశైలం (34) శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయమై మృతుడి భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని