బెట్టింగ్‌ రక్కసికి కుటుంబాలు క్లీన్‌బౌల్డ్‌
eenadu telugu news
Published : 24/10/2021 02:01 IST

బెట్టింగ్‌ రక్కసికి కుటుంబాలు క్లీన్‌బౌల్డ్‌

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన బెట్టింగ్‌ ముఠా సభ్యులు

* గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి చేపల వ్యాపారం చేస్తూ కుటుంబంతో గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయిదు నెలలుగా క్రికెట్‌ బెట్టింగ్‌ల్లో పాల్గొని రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. భారీగా అప్పులవడంతో చివరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ల వల్ల అనేక కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. కొంతమంది ఉన్న ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారు. సర్వం కోల్పోయిన కొంతమంది యువకులు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు. మహానగరంలో రూ.కోట్ల విలువైన బెట్టింగ్‌లు జరుగుతున్నా కూడా మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌ పూర్తయ్యే సరికి మహానగరంలో దాదాపు రూ.500 కోట్ల వరకు బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉందని అంచనా.

350 వరకు కేంద్రాలు..

నగరానికి చెందిన దాదాపు రెండు వేల మంది వరకు దిల్లీ, ముంబయి, చెన్నైకు చెందిన అతి పెద్ద బెట్టింగ్‌ నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకున్నారు. వీరి తోడ్పాటుతో నగరంలోని దాదాపు 350కు పైగా చిన్నా పెద్దా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులకు దొరక్కుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాన బుకీ (బెట్టింగ్‌ నిర్వాహకులు) ఇతర రాష్ట్రాల్లో ఉంటారు. వీరికి అనుబంధంగానే నగరంలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ప్రధాన బుకీ తర్వాత సబ్‌ ఆర్గనైజర్‌ ఉంటారు. ఆ తర్వాత బోర్డు ఆపరేటర్‌, సబ్‌ బుకీ, ల్యాప్‌ట్యాప్‌ ఆపరేటర్‌.. ఇలా ఉంటుంది వ్యవస్థ. నగరానికి చెందిన వారితో సబ్‌ బుకీకి సంబంధాలుంటాయి. అతని దగ్గరే నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. మియాపూర్‌, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లోని ఏడు చోట్ల జరుగుతున్న బెట్టింగ్‌ కేంద్రాలపై మాదాపూర్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేసి 23 మందిని అరెస్టు చేసి దాదాపు రూ.93 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ముంబయి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధాన బుకీలు ఏడుగురు పరారీలో ఉన్నారు.

వాట్సాప్‌ గ్రూపులు..

పోలీసు దాడులు జరుగుతుండటంతో బుకీలు సరికొత్త మార్గాలను అన్వేషించారు. బెట్టింగ్‌ల్లో పాల్గొనే వారితో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. బెట్టింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని అందులో పోస్టు చేస్తారు. ఈ వివరాలు ఆధారంగా బెట్టింగ్‌ల్లో పాల్గొనే వారి దగ్గర సబ్‌బుకీలు డబ్బులు వసూలు చేస్తుంటారు.

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రూ.300 కోట్లు

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌ మీదే హైదరాబాద్‌ మొత్తంలో దాదాపు రూ.300 కోట్ల వరకు బెట్టింగ్‌ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనికోసం ఘాన్సీబజార్‌, బేగంబజార్‌, అబిడ్స్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, మెహిదీపట్నం... ఇలా వందల కేంద్రాల్లో బెట్టింగ్‌ పందాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి.

పూర్తిగా దృష్టిపెట్టని పోలీసులు

ఒకటి అరా దాడులు తప్ప బెట్టింగ్‌లను నిరోధించే విషయంలో మూడు పోలీసు కమిషనరేట్లు దృష్టిసారించడం లేదని పెద్దఎత్తున విమర్శలు రేగుతున్నాయి. మాదాపూర్‌ ఎస్వీవోటీ పోలీసులు చక్కగా స్పందించినా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన స్పందన ఉండటం లేదు. రాచకొండ పరిధిలో కూడా దాడులే జరగడం లేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని