స్థలాలపై ఖద్దరు గద్దలు
eenadu telugu news
Published : 24/10/2021 02:21 IST

స్థలాలపై ఖద్దరు గద్దలు

ఈనాడు- సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు, హైదరాబాద్‌

* ఆదిభట్లలో ఒక వ్యక్తి అయిదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో వెంచర్‌ వేయడానికి అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. ఈ విషయం కీలక ప్రజాప్రతినిధి దృష్టికి వచ్చింది. వెంటనే సంబంధిత ప్రజాప్రతినిధి కుమారుడు రంగంలోకి దిగారు. వెంచర్‌ వేయాలంటే తమకు రూ.5కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము ఎందుకు ఇవ్వాలంటూ వారు ఎదురు తిరగడంతో రెవెన్యూ అధికారుల ద్వారా వివిధ రకాల నోటీసులు పంపించారు. సంబంధిత ప్రజాప్రతినిధికి కొంత మొత్తం ఇవ్వడంతోనే అక్కడ వెంచర్‌ వేయడానికి అనుమతి ఇచ్చారు.

* సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లోని ఒక ప్రాంతంలో సుమారు 700 చదరపు అడుగుల విస్తీర్ణమైన ప్రభుత్వ స్థలం. రూ.3కోట్ల వరకూ ధర పలుకుతుందని అంచనా. ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు ఆ స్థలాన్ని రాత్రికి రాత్రే వేరేవారికి కేటాయించినట్టు సమాచారం. పై స్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు రావటంతో రెవెన్యూ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతోంది.

* బంజారాహిల్స్‌ ప్రాంతంలో 400 చదరపు అడుగుల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ ఓ కుటుంబం షెడ్డు నిర్మించుకుంది. కొన్నాళ్లకు శాశ్వతనిర్మాణం చేపట్టడంతో అధికారులు తొలగించేందుకు వెళ్లారు. ఒక ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని స్థలాన్ని అతడికి కేటాయిస్తున్నట్టు తెల్లకాగితంపై సంతకం చేసిచ్చారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్టు వదిలేయమనటంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు వెనక్కి తగ్గారు.

రాజధాని పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు కొంతమంది రాజకీయ నాయకులకు కనక వర్షం కురిపిస్తున్నాయి. సర్కార్‌ భూమి అయితే వాటిని ప్రైవేటుగా రికార్డులు మార్పించి తమవారికే కట్టబెట్టడం ద్వారా భారీ ఎత్తున జేబులో వేసుకుంటున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో తమకు పట్టున్న నియోజకవర్గాల్లో ఎవరైనా ప్రైవేటు భూమిలో వెంచర్లు వేస్తే సంబంధిత నేత అడిగిన మొత్తం ఇవ్వకపోతే ఆ స్థలంలో వెంచర్‌కు అనుమతి రాకుండా అడ్డుకుంటున్నారు. పెద్ద వెంచర్‌ అయితే రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ఇవ్వాల్సిందే. ప్రభుత్వ భూములు, వివాదాస్పద స్థలాలను లక్ష్యం చేసుకొని అక్రమార్కులు దందాకు దిగుతుంటారు. కొవిడ్‌ సమయంలో పోలీసు, రెవెన్యూ అధికారులు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమవటం కబ్జాదారులకు మరింత కలిసివచ్చింది. ప్రజాప్రతినిధుల ప్రధాన అనుచరులు అన్నీ తామై చక్రం తిప్పారు. తాజాగా ప్రభుత్వ స్థలాలను గుర్తించమంటూ సర్కారు ఆదేశాలివ్వటంతో ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. వీటిలో అధికశాతం ప్రభుత్వ రికార్డుల్లో ల్యాండ్‌బ్యాంక్‌లో ఉన్న స్థలాలు కావటం గమనార్హం.


ఇప్పుడేం చేద్దాం

గతేడాది మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో మూడు జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ స్థలాలను సంరక్షించాలంటూ ఆదేశించారు. దీంతో హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్‌ జిల్లాలో 100 గజాల్లోపు ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటారు. ల్యాండ్‌బ్యాంక్‌లో గుర్తించిన సుమారు 1200 ప్రాంతాల్లోని స్థలాల సంరక్షణకు చర్యలు చేపట్టాలనే అంచనాకు వచ్చారు. ఆ సమయంలోనే షేక్‌పేట్‌, బండ్లగూడ, ఖైరతాబాద్‌, ఆసిఫ్‌నగర్‌, గోల్కొండ తదితర రెవెన్యూ మండలాల్లో ల్యాండ్‌బ్యాంక్‌లో పేర్కొన్న అధికశాతం స్థలాలు అన్యాక్రాంతమైనట్టు గుర్తించారు. దీని వెనక కొందరు స్థానిక నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఆయా ప్రాంతాల్లోని స్థలాలపై హక్కుదారులం తామేనంటూ పత్రాలు చూపి విక్రయించినట్టు తెలుస్తోంది.


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని