జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ నిర్బంధం
eenadu telugu news
Published : 28/10/2021 02:11 IST

జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ నిర్బంధం

అనుమతిలేని కట్టడాల పరిశీలనకు వెళ్లిన..

కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ను నిర్బంధించిన స్థలమిదే

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లిన జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ను, సిబ్బందిని బుధవారం కొందరు నిర్మాణదారులు నిర్బంధించిన సంఘటన బాలాపూర్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు, అధికారుల కథనం ప్రకారం... పహాడీషరీఫ్‌ సుల్తాన్‌పూర్‌ మధ్య ఉన్న బాలాపూర్‌ రెవెన్యూ పరిధి సర్వే నం.144, 145లోని వివాదాస్పద స్థలాల్లో తాజాగా ఇళ్లు నిర్మాణమవుతున్నాయి. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం అధికారులు అనుమతి లేని నిర్మాణాలంటూ ఇదే ప్రాంతంలో సుభాష్‌ గుప్త, గీత గుప్త నిర్మించుకున్న రెండు నివాస గృహాలను కూల్చివేశారు. తాము ఇక్కడ 16 ఎకరాల స్థలం కొనుగోలు చేశామని, అందులో నిర్మించుకున్న ఇళ్లలో ఐదేళ్లుగా నివాసముంటున్నామని వారు చెప్పినా కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల ప్రకారమే కూల్చివేశామని ఆనాడు అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కోర్టులో వివాదం కొనసాగుతున్నా తిరిగి ఇదే సర్వే నంబర్లలో మరికొందరు నిర్మాణాలు చేపడుతున్నారని బుధవారం తాజాగా అధికారులకు సమాచారం అందింది. దీంతో కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. సర్వే నం.144లోని ప్రధాన గేట్‌లోకి వారి వాహనాలు ప్రవేశించిన వెంటనే అక్కడున్న నిర్మాణదారులు గుర్తించారు. దీంతో ‘తరచూ మా వద్దకు వచ్చి వేధిస్తున్నారంటూ.. మిమ్మల్ని భరించలేమంటూ’ వెంటనే గేటు మూసి కమిషనర్‌తో పాటు సిబ్బందిని అక్కడే నిర్బంధించారు. భయాందోళనకు గురైన సిబ్బందికి ధైర్యం చెప్పిన కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ బాలాపూర్‌, పహాడీషరీఫ్‌ ఠాణాల పోలీసు అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిర్మాణదారుల్లో ఒకరు సంఘటనా స్థలానికి చేరుకుని పురపాలిక కమిషనర్‌ను ఇలా బంధించడం భావ్యం కాదంటూ గేటు తెరిపించారు. కమిషనర్‌ నేరుగా బాలాపూర్‌ ఠాణాకు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు. దీనిపై ఏ కేసు నమోదు చేయాలో పరిశీలిస్తున్నామని బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని