గుట్కా తయారీ ముఠా గుట్టురట్టు
eenadu telugu news
Published : 28/10/2021 02:11 IST

గుట్కా తయారీ ముఠా గుట్టురట్టు

రూ.44 లక్షల విలువైన సరకు, సామగ్రి పట్టుకున్న పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ సుధీర్‌, ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ తదితరులు

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: గుట్కా తయారీ ముఠాను చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.44.60 లక్షల విలువచేసే గుట్కాలు, తయారీ ముడిసరకు, యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఠాణాలో సీఐ నరేష్‌ నేతృత్వంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గోపాలపురం ఏసీపీ సుధీర్‌ వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన తలారి నవీన్‌కుమార్‌(40) మోండా మార్కెట్‌లో పూజాసామగ్రి విక్రయించే దుకాణంలో గుట్కాలు అమ్ముతున్నాడు. సీతాఫల్‌మండి డివిజన్‌ మైలార్‌గడ్డలో ఇంటిని అద్దెకు తీసుకుని గుట్కా తయారుచేస్తున్నాడు. ఈనెల 25న చిలకలగూడ పోలీసులకు సమాచారం అందడంతో నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. నగరంలో ఎక్కడెక్కడ తయారుచేస్తున్నడో తెలిపాడు.

తీగలాగితే కదిలిన డొంక: కాచిగూడకు చెందిన దలాల్‌ గోవింద్‌(53), సూరారానికి చెందిన సింహాద్రి మోహన్‌రావు(42) సైతం గుట్కాను తయారుచేస్తారని తెలియడంతో పోలీసులు ఆ ప్రాంతాల్లో దాడిచేసి మిషన్లు, ముడిసరకులు, కవర్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వారందరికీ బహదూర్‌పురకు చెందిన అగర్వాల్‌ ప్రదీప్‌కుమార్‌(66) ముడిసరకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వృత్తిరీత్యా వ్యాపారి అయిన ప్రదీప్‌కుమార్‌ సులభంగా డబ్బు సంపాదించాలనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. నవీన్‌కుమార్‌, గోవింద్‌, మోహన్‌రావులతో ముఠా ఏర్పాటు చేశాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, కర్ణాటక, గుజరాత్‌ నుంచి గుట్కా తయారీకి ముడిసరుకును తీసుకొచ్చి కాచిగూడలో గోవింద్‌కు చెందిన గోదాములో నిల్వ చేసి, అందరికీ సరఫరా చేసేవాడనే సమాచారాన్ని సేకరించారు. మంగళవారం ఏకకాలంలో అన్నిచోట్ల దాడిచేసి రూ.44.60 లక్షల ముడిసరకు, 4 తయారీయంత్రాలు, లేబుళ్లు, సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌కుమార్‌, గోవింద్‌, మోహన్‌రావు, ప్రదీప్‌కుమార్‌లను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న విలువ బయట మార్కెట్‌లో రూ.కోటి ఉంటుందని సమాచారం. సీఐ నరేష్‌, డీఐ సంజయ్‌కుమార్‌, ఎస్సైలు శ్రీనివాస్‌, సాయికృష్ణ, రఘువీర్‌రెడ్డిని ఏసీపీ అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని