close

మంగళవారం, జులై 16, 2019

ప్రధానాంశాలు

వ్యవసాయ పరిశోధన ఫలితాలపై రెండు రోజుల సమీక్ష

● నూతన పరిశోధనలకు మార్గ నిర్దేశకాలు

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం 

నంద్యాల, న్యూస్‌టుడే: రాయలసీమలోని అత్యల్ప వర్షపాత ప్రాంతాలైన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వ్యవసాయ పరిశోధన కేంద్రాల ద్వారా ఏటా జరుగుతున్న పరిశోధన, విస్తరణ ఫలితాలపై ఏటా నిర్వహించే సమీక్షను ఈ ఏడాది నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌)లో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. వ్యవసాయ పరిశోధనలతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ఈ సమావేశంలో సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో చర్చిస్తారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఈ ఏడాది పచ్చజొన్న ఎన్‌జే 2646, తెల్లజొన్న ఎన్‌జే 2647 రకాలను విడుదల చేశారు. అనంతపురం కేంద్రం నుంచి సజ్జలో ఏయూవీ 04 రకాన్ని, కదిరిలో వేరుశనగలో చిత్రావతి రకాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేశారు. శనగ, కొర్ర, ఇతర పంటలతోపాటు చిరుధాన్యాల్లో చిరుసంచులు కూడా విడుదల చేశారు.

● *కదిరి చిత్రావతి వేరుశనగ రకం జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు విడుదల చేశారు. ఈ రకం 110 రోజుల నుంచి 120 రోజుల్లో ఎకరానికి 3 వేల నుంచి 5200 కిలోల కాయ దిగుబడి ఇస్తుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 70 శాతం, వంద గింజల బరువు 50 నుంచి 60 గ్రాములు, గింజల్లో నూనె 49 శాతం ఉంటుంది. ఈ రకం మొవ్వకుళ్లు, కాండం కుళ్లు, వైరస్‌ తెగుళ్లను తట్టుకుంటుంది. అంతేకాకుండా ఆకుమచ్చ, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. వేరుశనగలో స్థానిక ప్రాథమిక దిగుబడి నిర్ధరణ పరిశీలనలో ఇతర రకాలైన కదిరి-9, కదిరి-2370, కదిరి-2368, కదిరి-2362 రకాలు కూడా అధిక దిగుబడిని ఇచ్చాయి. బహుళ ప్రాంత పరిశీలనలో 19 రకాలను పరీక్షించగా వైఎల్‌జీ-3, కదిరి అమరావతి, కే-1812, కదిరి అనంత వంటి రకాలకంటే అధిక దిగుబడిని ఇచ్చాయి.

పచ్చజొన్న ఎన్‌జే2646 రకం

● *నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వాణిజ్య సరళిలో సాగుకు జొన్న పంటలో తెల్లజొన్న, పచ్చజొన్న రకాలను విడుదల చేశారు. తెల్లజొన్న, పచ్చజొన్నలు అగ్గి, తుప్పు తెగుళ్లకు, కాండం తొలిచే పురుగులకు తట్టుకునే రకాలు. కంకి ఒక మోస్తరు కురుచగా నిడివి ఆకారంలో ఉండి మీసపు పోగులు కలిగి ఉంటాయి. ఇతర రకాలతో పోల్చినప్పుడు అధిక దిగుబడి ఇస్తుండటంతో వీటిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదు కావడంతో, రెండు జిల్లాల్లో పరిశోధనలను మరింత విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. సస్య విజ్ఞానం, సస్య ప్రజననం, యాంత్రీకరణ, మృత్తికశాస్త్రం, ఇతర అంశాలపై చర్చిస్తారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌తోపాటు అనంతపురం, రెడ్డిపల్లి ఏఆర్‌ఎస్‌, బనవాసి, రెడ్డిపల్లి, యాగంటిపల్లి, కల్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రాలు, అనంతపురం, కర్నూలు జిల్లాల ఏరువాక కేంద్రాల్లో చేపట్టిన పరిశోధనలు, కదిరి కేంద్రంతోపాటు తంగడంచ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై చర్చిస్తారు. మెట్ట ప్రాంతాల్లో అపరాలు, అఖిల భారత సమన్వయ పరిశోధన పథకం, మెట్ట వ్యవసాయ పథకం, వాతావరణ అనుకూల వ్యవసాయ పథకం, ఇతరత్రా పథకాల అమలుపై సమీక్షిస్తారు.

తెల్ల జొన్న ఎన్‌జే 2647 రకం

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.